టీడీపీ సీనియ‌ర్ నేత‌, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఇసుక కొరతను నిరసిస్తూ   ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టగా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా పార్టీ శ్రేణుల‌కు షాకిచ్చిన వంశీ...దానికి కొనసాగింపుగా మ‌రిన్ని ట్విస్టులు ఇచ్చారు. తాడేపల్లిలోని ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఆయ‌న‌తో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో వంశీ పార్టీ మార‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 


ఉద‌యం నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వార్త‌ల్లో నిలుస్తున్నారు.బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో  టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. గుంటూరులో జ‌రిగిన ఈ స‌మావేశంతో...వంశీ బీజేపీ బాట ప‌ట్ట‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అనంత‌రం వంశీని వెంటబెట్టుకోని ఒకే కారులో వెళ్లడం దీనికి బ‌లం చేకూర్చింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా వంశీ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు, ఇద్ద‌రు మంత్రుల‌తో వంశీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట పాటు వీరిద్ద‌రి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. దీంతో ...వంశీ పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.


కాగా, త‌ను పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌బోన‌ని...అలా చేస్తే...టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు త‌న‌కూ తేడా ఉండ‌ద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ త‌న పార్టీలో చేరాల‌ని ఎవ‌రైనా అనుకుంటే...ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో...వంశీ పార్టీ మారుతారా? ఒక‌వేళ అలాంటి నిర్ణ‌యం తీసుకుంటే...రాజీనామా చేస్తారా? అనేది ఆస‌క్తిని రేకెత్తించే అంశం. ఇదిలాఉండ‌గా, ఈ స‌మావేశంపై ఇటు వంశీ అటు వైసీపీ ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: