పవనిజం..ఇది పవన్ కల్యాణ్ అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు.. తమ హీరో పేరుకు యిజం తగిలించి.. ఆయన వ్యక్తిత్వమే ఓ ప్రత్యేక సిద్ధాంతంగా చెప్పుకునే వారు. అయితే ఈ పవనిజానికి ఇప్పుడు వైసీపీ కొత్త పేరు పెడుతోంది. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పేచీ పెట్టుకోవడం, చంద్రబాబుతో లాలూచీ పడటమే.. పవన్‌ యిజమని ఆరోపిస్తోంది.


ఇటీవల పవన్ కల్యాణ్ తరచూ జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి చివరిలో డ్రామాలాడారని, మళ్లీ ఇప్పుడు మోదీతో పెట్టుకొని తప్పు చేశామని యాక్షన్ చేస్తున్నారని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ను వ్యతిరేకించడమే పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతమన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా జగన్‌ను విమర్శించడమే పవన్‌ పనిగా పెట్టుకున్నారన్నారు.


గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపకుండా ప్రతిపక్షాన్ని తిట్టారు. ఇప్పుడేమో ప్రతిపక్షాన్ని ఒక్క మాట కూడా అనకుండా, అధికార పార్టీని విమర్శిస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌పై కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరిని ప్రశ్నించలేకపోయారని పవన్‌ విమర్శించారని, పవన్‌పై కేసులు లేవు కదా ఆయన ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ..ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.


ఇవాళ వైయస్‌ జగన్‌పై ఎన్నికేసులు ఉన్నాయని, ఆయన కేసులు ఎవరు చెబితే పెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ఎవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇచ్చారో అందరికి తెలుసు అన్నారు. చంద్రబాబు చెప్పిన చోట్ల పవన్‌ తన అభ్యర్థులను నిలబెట్టారన్నారు. లాలూచీ కార్యక్రమాలు పవన్‌ కళ్యాణ్‌ మార్చేస్తే బాగుంటుందన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కిడ్నీ పెషేంట్ల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే పవన్‌ అభినందించడని, అదే చంద్రబాబు ఏ ఘనకార్యం చేయకపోయినా ఆయనను శాలువాతో సత్కరించి అభినందిస్తారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: