చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ఢిల్లీలో చేపట్టిన ఒక్క రోజు దీక్ష ఇప్పుడు ఆయన పరువు తీసేస్తోంది. ఒక్క రోజు దీక్ష కోసం ప్రభుత్వం ధనం 11 కోట్లు వెచ్చించడంపై ఏకంగా హైకోర్టు కామెంట్లు చేయడంతో ఆయన నిర్వాకం వెలుగు చూసింది. ఐదేళ్ల పాటు చంద్రబాబు చేసిన ఇలాంటి దుబారాపై చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా వైసీపీ నాయకులు కూడా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచేశారు.


రోజూ ధర్మసూక్తులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేశారంటూ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. చివరకు చంద్రబాబు టీటీడీ నిధులను కూడా దీక్షలకు వినియోగించారన్నారు. చంద్రబాబు రాజకీయ కోణంతో దీక్షలు చేశారని పేర్ని నాని విమర్శించారు . ధర్మ ఫోరాట దీక్ష పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సొమ్ము ప్రజలది..సోకు టీడీపీది అన్న చందంగా సాగిందన్నారు.


చంద్రబాబు ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత దీక్ష చేశారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని విమర్శించారు. ఈ తప్పులను పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. 2004-2009 మధ్యలో మళ్లీ తాను మారానని, తప్పు చేశానని మన్నించాలని ఓట్లు వేయించుకున్నారని తెలిపారు.


2014లో నరేంద్రమోదీతో కాళ్లు పట్టుకొని, ఆయన బొమ్మ పెట్టుకొని ఓట్లు పొందిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో తన బావమరిదితో వచ్చి రాని భాషలో తిట్టించారని, దేశమంతా తిరిగి మోదీ హఠావో అని నినదించాడని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తప్పు అయిపోయిందని, ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. తప్పు చేసిన తరువాత ఒప్పుకొని, మళ్లీ సిగ్గు లేకుండా కలిసిపోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తన మనుషులను బీజేపీలో చేర్పించి చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: