మాజీ సీఎం చంద్రబాబు తరచూ ఓ మాట చెబుతున్నారు. తాను లక్ష కోట్ల రూపాయల విలువైన అమరావతిని ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తే దాన్ని జగన్ చంపేస్తున్నారని చెప్పుకుంటున్నారు. తాను బంగారు బాతు వంటి రాజధాని నిర్మిస్తే.. వైయస్‌ జగన్‌ అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. అమరావతి విలువను ఆయనకు ఆయనే లెక్కలు వేసుకుని లక్షల కోట్లుగా వర్ణించుకున్నారు. అయితే ఇదే సమయంలో ఆ బంగారు బాతుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


ఏపీ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో కనీసం టీ దొరికే పరిస్థితి కూడా లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అసలు పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబాబు చెప్పిన పచ్చి అబద్ధాలకు ఇదే రుజువని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏకంగా హైకోర్టు జడ్జి మాత్రం రాజధాని ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. కోర్టు భవనాలన్నీ కూడా 2018లోగా పూర్తి చేస్తానని చంద్రబాబు కోర్టుకు వెళ్లి అప్పిలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు.


చంద్రబాబును నమ్మి హైకోర్టును అమరావతికి మార్చితే..ఇక్కడ భవనాలు లేవంటున్నారు. దళితులకు పంచి పెట్టిన భూములను చట్టాలు మార్చి చంద్రబాబు దోచుకున్నారని వారు వివరించారు. చంద్రబాబు గజానికి రూ.10 వేలు ఖర్చు చేసిన తాత్కాలిక భవనాలు నిర్మించారు. కానీ ఆ భవనాల్లో చిన్న వర్షానికే నీరు చేరుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో అమాయకుల భూములు బలవంతంగా గుంజుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.


అంతే కాదు.. ఏమీ జరగక ముందే పదే పదే వందల సార్లు గ్రాఫిక్సులు, 3డీ ఇమేజులతో ఏదో జరిగిపోయిందన్న భ్రమలు కల్పించిన లేని బంగారు బాతును చంద్రబాబు చూపించిన తీరుపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే చంద్రబాబు చెబుతున్న బంగారు బాతును విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. తాము ఏం చేస్తారో క్లారిటీగా చెబితే బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: