ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న  గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి గాలిదుమారాన్ని రేపారు. తాజాగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ సరికొత్త రాజకీయాలకు తెరతీసింది. దాదాపుగా ఆయన టిడిపిని వీడి అధికార పార్టీ అయిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైనట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏడేళ్ల క్రితమే వంశీ రాకకు బీజం పడినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఒక సందర్బంలో ఎదురైనా జగన్‌, వంశీలు ఒకరికొకరు కౌగిలించుకున్నారు.   విజయవాడలో రోడ్డు మీద జరిగిన ఈ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్నుంచే వంశీ వైసీపీలో చేరతారని చర్చ జరిగింది. అప్పుడు కేవలం అనుకోకుండా దారిలో కలిశానని..పొలిటికల్‌గా తన జీవితమంతా టీడీపీలోనే ఉంటానని వంశీ చెప్పుకొచ్చారు. కానీ ఆ మాటలను తీసి గట్టుమీద పెట్టినట్టు ఉన్నారు.  కాగా మొత్తం మీద..తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఇరుకున పడేసేందుకు జగన్ మంత్రాంగం నడుపుతున్నట్టుగా సొసైల్ మీడియాలో చర్చ మొదలైంది.


రాష్ట్రంలో టీడీపీ పార్టీని బలహీనం చేసేందుకు, ఆ పార్టీని పుంజుకోనీయకుండా చేసేందుకు 'జగన్‌' జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం జగన్ తో జరిగిన భేటీ సమయంలో  నియోజకవర్గ అభివృద్ధా.. లేక వైసీపీలోకి చేరే అంశమా? అనే రెండు కోణాలతో పాటు..ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చివరకు అతను పార్టీలో చేరికకే  అని క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా 'వంశీ' తరువాత ఎవరు..? అనే దానిపై పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వంశీ తరువాత వెళ్లేదెవరనే దానిపై పార్టీ నాయకులు లెక్కలు కడుతున్నారు. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి అందకుండా దూరంగా ఉన్నారని చెబుతున్నారు. వీరందరూ పార్టీని వీడతారని చెబుతున్నారు.  వీరిలో విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి ముందు వరుసలో ఉన్నారు. ఆయన తరువాత ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులపై పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 



గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుడు, రాయలసీమకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యేపై పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 23 మందిలో ఎనిమిది మంది పార్టీ మారతారని, వీరు..పార్టీ మారతారు..లేదా..ప్రత్యేకంగా తమను ఓ గ్రూపుగా గుర్తించమని స్పీకర్‌కు లేఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తారని అంటున్నారు. పార్టీ మారితే స్పీకర్‌ వెంటనే వేటు వేస్తారని, వేయాలని 'జగనే' అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో.. వారు ఇప్పటికిప్పుడు పార్టీ మారరని, ఒక ప్రత్యేక గ్రూపుగా అసెంబ్లీలో ఉంటూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, తమకు అనుకూలమైన పరిస్థితులు వచ్చేదాకా అలా ఉండి ఆ తరువాత రాజీనామాలు చేస్తారన్న అంశంపైనా చర్చ కొనసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: