దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా మ‌రో కీల‌క నిర్ణ‌యం జ‌రిగింది. కొత్త పార్లమెంట్ భవనం, కేంద్ర సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి బిడ్లు ఖరారయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవ‌త్స‌రాలు పూర్తయ్యే 2022 నాటికి పార్లమెంటు రూపురేఖలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. పార్లమెంటు భవన పునరుద్ధరణ పనుల కాంట్రాక్టును గుజరాత్ కంపెనీకి అప్పగించింది. అర్కిటెక్చర్, డిజైన్ బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం తీసుకుంది. 


కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్ పూరి నూత‌న నిర్ణ‌యం వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ..నూత‌న ప్ర‌తిపాద‌న‌ల్లో భాగంగా, పార్లమెంటు రీ డిజైన్‌తో పాటు ఢిల్లీలోని సెంట్రల్ విస్టా, రాజ్‌పథ్ ప్రాంతాల్ని కూడా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా, పార్లమెంట్ భవనం, రాజ్‌పథ్ ప్రాంతాల్ని రీ డిజైన్ చేసే ప్రాజెక్టులను హెచ్‌సీపీ సంస్థ దక్కించుకున్నది అని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం పోటీ పడిన పలు కాంట్రాక్ట్ సంస్థల గురించి సమీక్షించిన తర్వాత సాధికారత జ్యూరీ కమిటీ సభ్యులు తుది నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. మూడు ప్రాజెక్టుల కోసం 15 నిర్మాణ సంస్థల నుంచి 24 ప్రతిపాదనలను గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం స్వీకరించగా వీటిలో ఆరు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. బిడ్డింగ్‌లో అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీకి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. కాగా, హెచ్‌సీపీ సంస్థ గతంలో సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను, ఢిల్లీలో బీజేపీ నూతన ప్రధాన కార్యాలయం నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేసింది.


ఇదిలాఉండ‌గా, మూడు ప్రాజెక్టుల్లో భాగంగా హెచ్‌సీపీ సంస్థ 2022 నాటికి (75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి) ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని పునరుద్ధరించడం లేదా కొత్త భవనాన్ని నిర్మించడం గానీ చేయాలి. 250 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టాలి. మూడు ఐకానిక్ భవనాల నిర్మాణానికి ఏజెన్సీలు డిజైన్‌లను ఖరారు చేయనున్నాయి. భవనాల డిజైన్ మనదేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2022 సంవత్సరంలో మూడు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, 2024 నాటికి కనీసం డజను ప్రభుత్వ కార్యాలయాలతో సమీకృత భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులో భాగంగా రాజ్‌పథ్‌ను కూడా హెచ్‌సీపీ పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా సుమారు 4 చ. కి. మీ. విస్తీర్ణంలో అంటే రాష్ర్టపతి భవన్ నుంచి విజయ్‌చౌక్, మధ్య ఢిల్లీలోని ఇండియా గేట్ వరకు ఉన్న ప్రాంతాలన్నిటినీ పునరుద్ధరిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: