ఏపీలో ముక్కోణపు రాజకీయం జరుగుతోంది. వైసీపీటీడీపీజనసేన మధ్య ఈ రాజకీయ క్రీడ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ పార్టీలంత బలం లేకపోయినా పవన్ కి ఉన్న బలగం పెద్దది. మెగా, పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ పుష్కలంగా ఉన్న పవన్ ను ఏపీ రాజకీయాల్లో తక్కువగా చూడలేం. పవన్ కు సొంత రాజకీయం చేసుకునే స్థాయి ఉన్నా ఆయన టీడీపీ నడిపిస్తున్న వ్యక్తిగా ముద్రపడిపోయాడు.

 


ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ ఇసుకపై పోరు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందుకు పవన్ తన వంతు పోరాటంగా నవంబర్ 3న లేదా 4న విశాఖ భవన నిర్మాణ కార్మికుల తరపున విశాఖలో భారీ ర్యాలీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ అంశంపై, వారి ఇబ్బందులపై పలుమార్లు అధికారపక్షాన్ని విమర్శిస్తున్నాడు పవన్. దీనిపై రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన స్టైల్లో పవన్ పై ట్విట్టర్ కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ చేసేది నీడలతో యుద్ధం. ఎవరో ఉసిగొల్పి కత్తి చేతికిస్తే తిప్పుతుంటాడు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు.. తన బాస్ చంద్రబాబు కుటుంబం గురించి, మొన్నటి ఎన్నికల్లో తన అన్నకు నర్సాపురం ఎంపీ సీటు ఎందుకిచ్చాడో వివరణ ఇస్తే బాగుంటుంది’ అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

 


ఇసుక సమస్యపై ఈ రెండు పార్టీలు భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడుతున్నాయి. దీంతో వీరిద్దరూ కలిసి ఒప్పందం ప్రకారమే ప్రభుత్వంపై దాడి చేస్తున్నారనేది వైసీపీ వాదన. ఈ నేపథ్యంలో పవన్ కు విజయసాయి రెడ్డి ఇచ్చిన కౌంటర్ ఆసక్తి రేపింది. దీనికి పవన్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: