కశ్మీర్ లో ఉగ్రవాదులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటివరకూ భద్రతాదళాలు, మొబైల్ టవర్లను టార్గెట్ చేసిన మిలిటెంట్లు.. ట్రెండ్ మార్చి ఎలక్ట్రిసిటీ టవర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికేతరులపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులు.. కశ్మీర్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. 


కశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తేశాక.. స్థానికేతరులపై దాడులు పెరిగాయి. ఇప్పటివరకూ భద్రతాదళాల్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. స్థానికేతరుల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దాడులు చేస్తున్నారు. మొదట యాపిల్స్ తీసుకెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ను కాల్చి చంపి.. ట్రక్కుకు నిప్పుపెట్టారు. తర్వాత ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కూలీని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు యాపిల్ వ్యాపారులపై దాడి చేశారు. వీరిలో ఒకరు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిసిటీ టవర్లను టార్గెట్ 


స్థానికేతరులపై దాడుల తర్వాత  కశ్మీర్ లోయను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు.. ఎలక్ట్రిసిటీ లైన్లు కట్ అయి ఉండటం చూసి అవాక్కయ్యారు. సరిగ్గా యాపిల్ వ్యాపారులపై దాడులు జరిగిన చోటే.. ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా కట్ అయి ఉన్నాయి. అయితే ఉగ్రవాదులు వైర్లు కట్ చేసిన టవర్ సస్పెన్షన్ టవర్ కావడంతో.. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదు. అయితే ఇవే దాడులు పునారవృతమైతే.. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న వందలాది ఎలక్ట్రిసిటీ టవర్లకు భద్రత కల్పించడం కష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మౌలిక సదుపాయలను ధ్వంసం చేయడం ద్వారా కాశ్మీర్‌ భారీ నష్టం కలిగించే ప్లాన్‌లో ఉన్నారు.


ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో మనసైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కంటిమీద కునుకులేకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. చీమచిటుక్కుమన్నా గన్నులు ఎక్కుపెడుతున్నారు. ఇటీవలే కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మన జవాన్ లు.. దేశభద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ టెర్రరిస్ట్ లు మాత్రం ఇక సాధారణ ప్రజానీకాన్ని అస్థవ్యస్థం చేసేందుకు సిద్ధమయ్యారనే సమాచారం వస్తోంది. అందుకే ఎలక్ట్రికల్, సమాచార వ్యవస్థను ధ్వంసం చేసి.. మారణహోమాన్ని సృష్టించేందుకు రెడీగా ఉన్నారనే సమాచారంతో మన సైనికులు అలర్ట్ గా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: