ఢిల్లీలో టీడీపీ నిర్వహించిన ఒక రోజు ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ ధనాన్ని 10కోట్లు ఖర్చు పెట్టిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఖండిస్తూ ఆ కార్యక్రమానికి అయిన ఖర్చు ఒక కోటి మాత్రమేనని, ఆధారాలుంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు మీడియా సమక్షంలో తెలిపారు.

 


2019 ఫిబ్రవరి 11న జరిగిన ఆ దీక్ష ఖర్చుకు సంబంధించి అప్పటి ప్రభుత్వ హయాంలో 10కోట్లు విడుదల చేసిన జీవో కాపీ నెం.215ను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టి చదివి వినిపించారు. మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య విసిరిన సవాల్ ను ఎమ్మెల్యే ఉదహరిస్తూ.. ‘నీకు దమ్ముంటే.. నీకు ఖలేజా ఉంటే, నువ్వు వస్తానన్న సెక్రటేరియట్ కు వచ్చి ఈ జీఓ అబద్దమని నిరూపించు’ అని ఆయన ప్రతి సవాల్ విసిరారు. ‘ఆ దీక్షకు అంత ఖర్చు చేయలేదని వర్ల రామయ్య, చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఖర్చును మేము నిరూపిస్తే మీరిద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ అని కూడా సవాల్ విసిరారు. ధర్మ దీక్షలతో చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం జిల్లాకో కోటి రూపాయలు విడుదల చేసి మూడు కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద 49 కోట్లు ఖర్చును దుబారా చేసి మీరు సాధించిందేంటి అంటూ దుయ్యబట్టారు. అప్పట్లో దీనిపై వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు జస్టిస్ మహేశ్వరి, సోమయాజులు చేసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు. ‘ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. ఏ హక్కుతో, ఏ చట్టంతో ఇంత ధనాన్ని విడుదల చేశారు. ఇది ప్రజాధనం’ అన్నారని తెలిపారు.

 


చంద్రబాబు నిన్ను పక్కన పెట్టినా ఎందుకు జగన్ పైకి వస్తున్నావని ఆయన ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలను కట్టిపెట్టాలని హైకోర్టు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం టీడీపీ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి అన్యాయంగా పొలాలు తీసుకుని చంద్రబాబు చేసింది శూన్యమని అన్నారు. టీ తాగడానికి లేదంటూ హైకోర్టు న్యాయమూర్తు చేసిన వ్యాఖ్యలు మీరు చేసిన పనికేనంటూ మండిపడ్డారు. టాయిలెట్లు కూడా లేని తాత్కాలిక భవనాలను నిర్మించారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: