హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మౌనంగా ఉంది. ఎన్నికల ఫలితాల తరువాత అంతా సైలెంట్ అయ్యారు.  హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో పరిస్ధితి అనుకూలంగా ఉన్నా కూడా.... పరాభవం ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిందంటే... అంతా స్పందించేవారు. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. కారణాలు వెతకటం తప్పితే.. ఫలితం లేదనుకున్నారో ఏమో కానీ.. గప్ చుప్ గా ఉండిపోయారు.


ఉపఎన్నికల్లో  ఫలితాలు తనకే అనుకూలంగా వస్తాయనుకున్నారు. అధికార పార్టీ దూకుడు మీదున్నా...కట్టడి చేస్తామని అంచనాలు వేసుకున్నారు. కానీ లెక్కతప్పింది. అది కూడా  అంతా ఇంతా కాదు. ఏకంగా 43 వేల మేజార్టీ కట్టబెట్టడంతో... కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ్ కు వ్యతిరేకత లేదని ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్పారు. కానీ అలాంటి పరిస్ధితులలోనే ఇలాంటి ఫలితాలు వస్తే...మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్ధితి ఏంటి అనే చర్చ కూడా మొదలైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీ ముఖ్యనాయకులు కూడా దీని పై స్పందించటానికి అంత సుముఖంగా లేరు. అధికార పార్టీ డబ్బులు పంచి గెలిచిందనే అభిప్రాయమే తప్పితే... మరో మాట మాట్లడం లేదు. కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ ఎన్నికలు తీవ్ర అసంతృప్తిని, నిరాశను మిగిల్చాయి. ఇలాగే కొనసాగితే పార్టీ పరిస్ధితి ఏంటనేది చర్చ జరుగుతోంది.   


ఫలితాలపై ఇప్పటివరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించలేదు. అభ్యర్ధిగా పద్మావతి రెడ్డి మాత్రం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా... అధికార పార్టీకి కలిసి వచ్చిన అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి మాత్రం.... ఎన్నికల్లో గెలవటానికి అన్నిప్రయత్నాలు చేశాం.. కానీ ప్రజల తీర్పు అలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటిని ఫోకస్ చేసి ప్రచారం చేసినా.. జనం మాత్రం నియోజవర్గం అంశాలనే పరిగణలోకి తీసుకున్నారా..? లేదంటే ఒత్తిడికి గురయ్యారా.,.? అనే చర్చ చేశారు. 


హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్రమైన సమస్యల్లోకి నెట్టిందనే చెప్పాలి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా... అధికార పార్టీ ముందు నిలబడలేకపోతున్నామనే ఆవేదన మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ లో.... రాజీనామాల డిమాండ్ తెరమీదకు వచ్చేది.  కానీ ఇప్పుడు అది కూడా లేదు. కానీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నా...పార్టీని గట్టెక్కించేది ఎవరనే వాదన కూడా ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఇక్కడి వ్యవహారాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. పార్టీ స్ధితిగతులతో పాటు...పార్టీ పదవుల వ్యవహారం పై కూడా చర్చించాలనే ఆలోచనలోనే ఉత్తమ్ ఉన్నారు. సాధారణ ఎన్నికల నుంచి ఇదే అంశం పై..అధిష్టానానికి పలు అంశాలపై చెప్తూ వచ్చారు. ఐతే ఇప్పుడు పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


సోనియా గాంధీని కలిసి అన్ని పరిస్ధితులు వివరించిన తరువాత.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలనే అభిప్రాయంతో ఉత్తమ్ ఉన్నట్టు సమాచారం. ఐతే ఇప్పటికే తెలంగాణలో నాయకత్వం మార్పు పై చర్చ జరుగుతున్న సమయంలో... ఎలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అనేది అసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నాటికి ఇదే టీమ్ ని కొనసాగిస్తారా..? లేదంటే... కొత్తవారికి అవకాశం ఇస్తారా..? అనే చర్చ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర నాయకత్వం రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు...పరిణామాల పై బిజీ గా ఉంది. ఇప్పుడున్న పరిస్ధితిలో తెలంగాణ లో పార్టీ గురించి ఇప్పటికిప్పుడు ఆలోచించే పరిస్ధితి కనిపించటం లేదు. కానీ మార్పు మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: