ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికేఏపీలో అందుతున్న ఈ సేవలు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.


వైఎస్సార్‌ ఆరోగ్య  సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని పొడిగిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకునేలా, అవయవమార్పిడి ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, పీడీయాట్రిక్ సర్జరీలు సహా 17 అంశాల్లో వైద్య చికిత్సలకు అస్కారం కల్పిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ మూడు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ చికిత్సల కోసం పేరెన్నికగన్న ఆస్పత్రులను గుర్తించి ఎంప్యానల్ చేసేందుకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో 71 మంది ఆరోగ్య మిత్రల సేవలతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బందిని మరో ముగ్గురు జిల్లా స్థాయి సమన్వయ కర్తల్ని నియమించుకునేందుకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.


ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఇక ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తామని, రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: