ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ లో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వైపు ఓటమి నుంచి కోలుకోక ముందే మరోవైపు నేతలు జంప్ అయిపోతున్నారు. అయితే ఇదే గ్యాప్ ని ఉపయోగించుకుని బీజేపీ ఏపీలో ఎదిగిపోవాలని ఎన్నికల ఫలితాల వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అనేక మంది టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకుంది. అటు జనసేన నేతలని కూడా లాగేస్తుంది. ఈ విధంగా నేతలని లాగేస్తూ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని వీక్ చేసి...వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిపోవాలని చూస్తోంది.


అయితే ఏపీలో బీజేపీ ఎదిగితే అది టీడీపీకే కాదు...అధికార వైసీపీకి కొంత నష్టం చేకూరే అవకాశముంది. అందుకే ఈ విషయాన్ని గమనించిన జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకొచ్చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల బీజేపీ కొంచెం హడావిడి చేసింది. ఇక ఇప్పుడు జగన్ పాలనని గాడిలో పెట్టుకుని.... వలసలపై కూడా ఓ లుక్ వేశారు. ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడుపుతూనే....టీడీపీ, జనసేనల్లో ఉన్న సమర్ధవంతమైన నేతలని పార్టీలోకి లాగేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలని వైసీపీలోకి  తీసుకున్నారు.


ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలని కూడా పార్టీలోకి తీసుకునేందుకు ప్లాన్ చేశారు. అది కూడా పదవులకు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకొనున్నారు. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు కూడా త్వరలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.  వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.


అయితే ఇలా ఎప్పుడైతే వైసీపీ వలసలని ప్రోత్సహించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. ఏదో కొందరు వైసీపీలోకి వెళ్లలేని వారు అప్పుడు బీజేపీలో చేరారు తప్ప...ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదని చెప్పాలి. అసలు నూటికి నూరు శాతం జగన్ ఏపీలో బీజేపీలో ఎదగనివ్వరు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: