పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. నవాజ్‌ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యారు. గుండెపోటు రావడంతో లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  జైల్లో ఉన్న నవాజ్‌షరీఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లాహార్‌ హైకోర్ట్‌ ఆయనకు బెయిల్‌ ఇచ్చింది.


కొద్దిరోజులుగా పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజుల క్రితమే ఆనారోగ్యంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం నవాజ్‌ లాహోర్ ఆసుపత్రిలో ఉన్నారు.


పనామా పత్రాలకు సంబంధించిన స్కామ్‌లో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన ప్లేట్‌లెట్ల సంఖ్య దారుణంగా పడిపోవడంతో లాహోర్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినడానికి ఇమ్రాన్‌ ప్రభుత్వమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నవాజ్‌పై విషప్రయోగం జరగడం వల్లే ఇలా జరిగిందని వారు ఆందోళన చెందుతున్నారు.


అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ దోషిగా తేలడంతో పాక్ సుప్రీంకోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన 2018 డిసెంబరు 24 నుంచి లాహోర్ జైల్లో ఉన్నారు. పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ మూడుసార్లు ఎన్నికయ్యారు. నవాజ్‌ ఆరోగ్య విషయం తెలుసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఆయనకు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీష్ అభిమానులు... పార్టీ కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి వస్తున్న నేతలను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నవాజ్ షరీఫ్ కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటూ.. తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. మొత్తానికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యం అక్కడి వారిలో భావోద్వేగానికి గురిచేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: