ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్‌టీఆర్ ను చెప్పుకుంటే.. వాటి జోరు పెంచిన వాడుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్పుకుంటారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అద్భుతమైన పథకాలను రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఆయన్ను మించిపోయే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నాడు.


రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీని తీసుకొస్తే.. వైఎస్ జగన్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇవ్వబోతున్నారు. అంతే కాదు... రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లించబోతున్నారు.


ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జగన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.


ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో... ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి.. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు అత్యధికం ఖర్చు చేస్తున్న అంశం వైద్యం. సామాన్యులకు దూరంగా ఉన్న ఈ వైద్యాన్ని జగన్ తన పథకాలతో అందరికీ చేరువ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: