ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు ఒకే రోజు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు, మెట్రో నగరాల్లో వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు, శానిటేషన్ కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం మూడు వేరు వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధిన కీలక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. 
 
నవంబర్ 1వ తేదీ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో గుండె జబ్బులు, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, రేడియేషన్ అంకాలజీ సేవలను పొందటానికి వైసీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. 17 సూపర్ స్పెషాలిటీ సేవల్లో 216 జబ్బులకు ఏపీ ప్రజలు ఇతర రాష్ట్రాల్లోను వైద్యం చేయించుకోవచ్చు. 
 
ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి నెలకు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం కుటుంబ పెద్ద రోగంతో మంచాన పడితే రోజుకు 225 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 
 
చికిత్స అనంతరం రోగి కోలుకొనే వరకు సాయంగా రోగికి 225 రూపాయల చొప్పున ఇస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఈ సాయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 6,500 రూపాయల నుండి 16వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతాలు 2020 జనవరి నెల 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: