మనుషుల నిత్య జీవితంలో ధనానికి సముచిత స్థానం ఉంది. కష్టపడి సంపాదించిన ధనం ఎల్లప్పుడూ ఉత్తమమైనది. తాత, తండ్రుల ద్వారా వచ్చిన ధనం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. స్త్రీపై ఆధారపడి సంపాదించిన ధనం మాత్రం చెడు ఫలితాలను ఇస్తుంది. కష్టపడి, సక్రమ మార్గంలో ధనాన్ని సంపాదిస్తే ఆ ధనానికి ఎంతో విలువ ఉంటుంది. కష్టపడి సంపాదించిన ధనం జీవితంలో ఎల్లప్పుడూ ధనాన్ని కూడబెట్టుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. 
 
చాలా మంది మనుషులు ధనం సంపాదించటం కొరకు తప్పులు చేస్తుంటారు. మోసాలు, అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతుంటారు. మరికొంతమంది ధనం లేకపోతే జీవితమే లేదనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. కానీ మనుషులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుడే సృష్టించాడని ఈ ప్రపంచంలోని సంపద అంతా భగవంతునికి మాత్రమే చెందుతుందని గ్రహించాలి. 
 
అర్ధశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు ధనాన్ని ఎల్లప్పుడూ సమస్త జనులకు శుభం మరియు సంక్షేమం కలిగించే విధంగా ఖర్చు పెట్టాలని చెప్పాడు. అడం స్మిత్ ధనాన్ని సంపాదించటానికి నైతిక మార్గమే ఎంతో ఉత్తమమని చెప్పాడు. మనుషుల జీవితంలో సుఖంగా, సంతోషంగా జీవించటానికి ధనం అవసరమే. కానీ అవసరమైంత డబ్బు ఉన్న సమయంలో కూడా ఇంకా సంపాదించాలనే ఆశతో మనుషులు ధనార్జనకు బానిసలవుతున్నారు. 
 
ప్రపంచంలో అన్నిటికన్నా ధనమే బలమైనదన్న భ్రమలో బ్రతుకుతున్నారు. కొందరు ధనం మాత్రమే అన్ని అవసరాలకు మూలం అని భావిస్తారు. మరికొందరు మాత్రం సంపాదించిన ధనంతో మంచి పనులు చేస్తూ మహానుభావులు అవుతారు. ధనం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండే వ్యక్తులు రోజూ దర్శనమిస్తూనే ఉంటారు. మనుషులు ధనం మీద వ్యామోహాన్ని అదుపులో పెట్టుకుంటే జీవితంలో ఎల్లప్పుడూ ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పరిపాలన కొరకు ఉపయోగించే ధనమైతే ఆ ధనం ఎల్లప్పుడూ ప్రజాసంక్షేమానికి ఉపయోగపడాలి. అప్పుడే ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందుతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: