ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో....ప్ర‌భుత్వం- కార్మిక సంఘాల ప్ర‌తినిధుల మ‌ధ్య జ‌రిగిన మొద‌టి చ‌ర్చ‌ల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే...ఆర్టీసీ కార్మిక యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్మెంట్ శనివారం జరిపిన చర్చల్లో ఏమీ తేలలేదు. యూనియన్ల పట్టు.. అధికారుల ష‌ర‌తుల‌తో అర్ధాంత‌రంగా ముగిసింది. అయితే, ఇటు హైకోర్టు ఆదేశాల‌ను పాటిస్తూనే...అటు కార్మికుల‌కు షాక్ ఇచ్చేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కంలో...ఈ చ‌ర్చ‌ల ప‌రంప‌ర సాగింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.


హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఆర్టీసీ స‌మ్మె విర‌మ‌ణ‌కై ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌ను తెర‌మీద‌కు తెచ్చింది. టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఈ అశ్వత్థామరెడ్డి (టీఎమ్‌యూ), కో కన్వీనర్లు కె రాజిరెడ్డి (ఎంప్లాయీస్‌ యూనియన్‌), వీఎస్‌ రావు (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌), వాసుదేవరావు (సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌)లను మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో చర్చలు జరిపేందుకు రావాలని యాజమాన్యం శనివారం ఉదయం లేఖలు పంపింది. అయితే తాము ఎనిమిది మంది ప్రతినిధులతో కూడిన బృందంగా చర్చలకు వస్తామని జేఏసీ నేతలు కోరారు. అధికారులు మాత్రం నలుగురు నేతలకే అనుమతిచ్చారు. సునీల్‌శర్మ సమావేశాన్ని ప్రారంభిస్తూ... కోర్టు సూచించిన 21 అంశాలపై చర్చిద్దామని ఏకవాక్య ప్రతిపాదన చేశారు. దీనికి జేఏసీ ప్రతినిధులు స్పందిస్తూ...కోర్టు కేవలం 21 అంశాలనే చర్చించమని ఆర్డర్‌లో ఎక్కడా పేర్కొనలేదని, జేఏసీగా ఇచ్చిన 26 డిమాండ్లు లేదా టీఎమ్‌యూగా ఇచ్చిన 45 డిమాండ్లపై చర్చిద్దామని చెప్పారు. అది సాధ్యం కాదని అధికారులు చెప్పారు. అధికారులు ప్రతిపాదిస్తున్న 21 అంశాలపై చర్చించాలా వద్దా అని తమ సహచరులతో మాట్లాడి చెప్తామని, ఫోన్లు ఇప్పించాలని జేఏసీ నేతలు కోరారు. దానికి అధికారులు అంగీకరించలేదు. ఇక్కడే నిర్ణయం తెలపాలని అన్నారు. పోనీ తమలో తాము సంప్రదింపులు జరుపుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించకుండా...సమావేశమందిరం నుంచి అర్ధంతరంగా లోనికి వెళ్లిపోయారు. 


దీనితో జేఏసీ ప్రతినిధులు బయటకు వచ్చి జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పారు. యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ అధికారులు అర్ధంతరంగా వెళ్లిపోయి, ఎంతసేపటికీ రాలేదని తెలిపారు. అందువల్లే తాము బయటకు రావల్సి వచ్చిందని చెప్పారు. అయితే తామేమీ బయటకు వెళ్లిపోలేదని, జేఏసీ నేతలే ఇప్పుడే వస్తామని వెళ్లి, రాలేదని ఉన్నతాధికారులు తెలిపారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన చర్చల ప్రక్రియ ఏమీ తేలకుండానే సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది.దీంతో కేవలం కోర్టుకు ఆధారాలను చూపడం కోసమే ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతల్ని చర్చలకు ఆహ్వానించింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.  మొత్తానికి చర్చలు ఓ ప్రహసనంగా మారి అర్ధంతరంగా ముగిశాయని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: