మహారాష్ట్ర, బీహార్‌ గెలుపు తర్వాత ఎమ్.ఐ.ఎమ్ ఇప్పుడు జార్ఖండ్‌ పై దృష్టి సారిస్తోంది. డిసెంబర్‌లో జరుగనున్న జార్ఘండ్‌ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఒకటి రెండు స్థానాల్లో అయినా జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే జార్ఘండ్‌లో ఎమ్‌.ఐ.ఎమ్‌ ఎంత వరకు ప్రభావం చూపగలుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


జాతీయ పార్టీగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్న ఎమ్‌.ఐ.ఎమ్‌ పార్టీకి...మహారాష్ట్ర, బీహార్‌ ఎన్నికల ఫలితాలతో కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర రాష్ట్ర శాససనభ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయినా... రెండు కొత్త నియోజకవర్గాల్లో పాగా వేయగలిగింది. మరో ఐదు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలబడింది. అటు బీహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతంలోని కిషన్‌గంజ్‌ నియోజకవర్గంలో జెండా ఎగరేసి ఆ రాష్ట్రంలో బోణి కొట్టింది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పటికే జాతీయ స్థాయి నాయకుడిగా జాతీయ మీడియాలో ఇమేజ్‌ను సృష్టించుకోగలిగారు. దీంతో ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో అసద్‌కు తేలిగ్గానే అనుచరగణం ఏర్పడుతోంది. 


ఇటీవల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో  డిసెంబర్‌లో జరుగనున్న జార్ఖండ్‌ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు ప్రారంభించింది ఎమ్‌.ఐ.ఎమ్‌. రాంచీ వేదికగా పార్టీ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే అక్కడ అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభ, బైక్‌ ర్యాలీలు కూడా చేపట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఘండ్‌లో ముస్లిం మైనార్టీలు 15 శాతం ఉన్నారు. ఒక్క రాంచీ నగరంలోనే దాదాపు రెండు లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ముస్లిం వర్గం నుంచి ఒక్క అభ్యర్ధిని కూడా టికెట్‌ ఇవ్వకపోవటమే కాకుండా...అటు సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునే గ్రాండ్‌ అలయెన్స్‌ కూడా ఒక్క ముస్లిం అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవటంతో...ఈ వర్గం రాష్ట్రంలోని రాజకీయ పక్షాల పై ఆగ్రహంతో ఉంది. తమను కేవలం ఓట్‌ బ్యాంక్‌గానే పరిగణిస్తున్నాయి కానీ.. చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం, అవకాశం ఇవ్వటం లేదని భావిస్తున్నాయి. దీంతో ముస్లిం వర్గాలను ఆకర్షించేందుకు, ఆ వర్గ ఓట్‌ బ్యాంక్‌ను గంపగుత్తగా తమ ఖాతాలో వేసకునేందుకు పావులు కదుపుతున్నారు ఒవైసీ బ్రదర్స్‌. 


దియోఘర్‌, గొడ్డా, జాంతారా, సాహిబ్‌ గంజ్‌, పకుర్‌ ...లోహర్ద్‌గా, గిరిధి జిల్లాల్లో ముస్లిం జనాభా గెలుపు అవకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉంది. షాహిబ్‌గంజ్‌, పకుర్‌ జిల్లాల్లో ఏకంగా ముస్లిం మైనార్టీ వర్గాలు 30 శాతంగా ఉంటే, డియోఘర్‌, గొడ్డా, జామ్‌తారా, లోహర్ద్‌గా, గిరిధి జిల్లాల్లో 20శాతం జనాభా ముస్లిం వర్గాలే. తగిన వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను, మద్దతుదారులను బలోపేతం చేసుకుంటే పతంగి జార్ఘండ్‌లో ఎగరటానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: