ఉగ్రవాదంతో ఎన్నో దేశాలను ముప్పుతిప్పలు పెట్టిన అబు బాకర్‌ను అమెరికా మట్టుబెట్టిందా..? యూఎస్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్‌లో ఆ కరుడు గట్టిన ఉగ్రవాది హతమయ్యాడా..? ట్రంప్‌ ట్వీట్.. అబుబాకర్ ఆపరేషన్ గురించేనా..? అబుబాకర్‌ నిజంగానే అంతమయ్యాడా..? లేదా అనే విషయం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారింది.


ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్ర నేత అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో హతమార్చినట్టు అగ్రరాజ్యం తెలిపింది. సిరియాలో ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్ లో యూఎస్‌ ఆర్మీ..అబుబాకర్‌ను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు వైట్‌హౌస్‌కు సమాచారం అందజేసినట్టు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపారు. అబుబాకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. ఈ ఆపరేషన్‌ను  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారు. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగిందని ట్వీట్‌లో పేర్కోన్నారు. 


ప్రపంచంలోనే మోస్ట్ వాంటెట్ పర్సన్‌గా అబు బాకర్ ఉన్నాడు. 2011లో అగ్రరాజ్యం అబుబాకర్‌పై 10 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించింది. ఐఎస్ చీఫ్ అయిన అబుబాకర్  1971లో బాగ్దాద్‌లో జన్మించాడు. ఇరాక్ అధినేత సద్దామ్ హుస్సేన్ పరిపాలన జిహాజ్‌ టెర్రరిస్ట్‌గా మారాడు. తర్వాత అల్కాయిదా కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2010లో ఇరాక్‌లోని అల్‌కాయిదా గ్రూప్‌లన్నీ కలిసి ఐఎస్‌గా మారింది. అప్పుడు ఐఎస్ చీఫ్‌గా అబుబాకర్‌ ఎంపికయ్యాడు. అప్పుట్నుంచి ఐఎస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మారణ హోమాన్ని సృష్టించింది. సిరియా కేంద్రంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా లకు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు అబుబాకర్. ఇరాక్- సిరియాలో స్థావరాలను ఏర్పాటుచేసుకున్న అల్ బాగ్దాదీ నాయకత్వంలోని ఐఎస్ సంస్థ వేలాది మందిని ఉగ్రవాదులుగా మార్చింది.


అబుబాకర్ తమ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో మరణించినట్లు రష్యా రక్షణ శాఖ 2017 జూన్‌లో ప్రకటించింది. సిరియా నగరం రఖాపై 2017 మే నెలలో జరిగిన రష్యా వైమానికి దాడిలో అబు బాకర్ బాగ్దాదీ మృతి చెందినట్లు పేర్కొంది. కానీ ఇప్పుడు వైమానిక దాడుల్లో బాగ్దాదీ ఖచ్చితంగా మరణించి ఉంటాడని రష్యా ప్రకటించిన స్పష్టమైన ఆధారాలు లేవు. ఐసిస్‌ లక్ష్యంగా ఇప్పుడు అమెరికా సైన్యం దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐఎస్‌ అధినేత హతమయ్యాడని అమెరికా సైన్యం భావిస్తోంది. ఈ విషయంపై ట్రంప్ క్లారీటీ ఇచ్చే వరకు అబుబాకర్ మరణంపై ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: