కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వస్తారా..? ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల వైఫల్యాలు పక్కన పెట్టి తెలంగాణలో చీఫ్ ని మార్చటానికి అధిష్టానం రెడీగా ఉందా..?  కొత్త చీఫ్‌గా ఎవరికి అవకాశం దక్కనుంది..? హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు ఉత్తమ్ ను రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టాయా..? ఇలాంటి అంశాలే  కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ కి కొత్త చీఫ్ రాబోతున్నారా ? పార్టీపునర్వస్థీకరణ జరగాలని రెండు తెలుగు రాష్ట్రాల నేతలు బలంగా కోరుకుంటున్నారు. 


తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు  పార్టీ నాయకత్వం మార్పు ఉంటుందా..? గత కొద్ది రోజులుగా తెలంగాణలో నడుస్తున్న చర్చ. పీసీసీ మార్పు అంశం చాలా కాలంగా చర్చ జరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల తరువాత దీనిపై కసరత్తు జరుగుతుందని ఊహాగానాలు వినబడ్డాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు  రావటం...అది కూడా కాంగ్రెస్ కి ఊహించని పరాభవం ఎదురైంది. దీంతో అంతా ఉత్తమ్ పార్టీ పదవికి రాజీనామా చేస్తారని భావించారు. అయితే సోనియా గాంధీని కలిసి...ఇక్కడి పరిస్ధితులు తానే చెప్పాలని అనుకున్నారు. తన పదవికి రాజీనామా చేయటానికి సిద్దమయ్యారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అధిష్టానం తో మాట్లాడిన తరువాతే అసలు నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావించారు. అయితే ఉత్తమ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ జగ్గారెడ్డి స్టేట్ మెంట్ చేశారు. సీఎం కూతురు కవిత ఓడిపోగా లేనిది... పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోతే అదో పెద్ద సమస్యా... అని చర్చకు లేవనెత్తారు. 


మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు వచ్చిన తరువాత సోనియా గాంధీ... పార్టీ నిర్మాణం మీద దృష్టి సారిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్ లను నియమించే అంశం పై అధిష్టానంలో చర్చ అయితే మొదలైంది. ఏపీకి పీసీసీ చీఫ్ ఎవరన్నదానిమీద కూడా చర్చించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ల ఎన్నికకు సంబంధించిన అంశంపై.. వీరప్ప మెయిలీ, జై రామ్ రమేష్ లకు బాద్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన కసరత్తు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. 


ఏపీకి మాత్రం మాజీ మంత్రి శైలజానాథ్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఎవరికి బాధ్యతలు ఇవ్వాలన్న దాని మీద చర్చ హాట్ టాపిక్‌గా మారింది.  టీపీసీసీ చీఫ్ రేస్‌లో ప్రస్తుతం... శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి పదవి వరిస్తుందన్నది చూడాలి. రేవంత్ కి సీనియర్లు నుంచి వ్యతిరేఖత నడుస్తోంది. కాంగ్రెస్ చీఫ్‌ విషయంలో అధిష్టానం మనసులో ఏముందో.. ఉత్తమ్, సోనియాగాంధీ భేటీ తరువాత తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: