1987, 1988 సంవత్సరాల్లో 18 నెలలపాటు రామాయణం సీరియల్ నడిచింది. వారానికి ఒకటి చొప్పున 45 నిమిషాల నిడివి ఉన్న 78 ఎపిసోడ్లను రామానంద్ సాగర్ రూపొందించారు. అప్పుడు భారత్‌లో నడిచే ఏకైక టీవీ ఛానెల్ దూరదర్శన్‌లో ఆదివారం ఉదయం ఇది వచ్చేది.కొన్ని కొన్ని ఎపిసోడ్లను ఏకంగా 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది వీక్షించారు. అంటే దేశ జనాభాలో ఎనిమిదో వంతు ప్రజలు.


భారతీయుల సాంస్కృతిక జ్ఞాపకాల్లో రామాయణానికి ఉన్న ప్రత్యేక స్థానమే ఆ టీవీ సీరియల్‌కు అంత గొప్ప ఆదరణ తెచ్చిపెట్టింది.ఈ టీవీ సీరియల్ వచ్చే సమయంలో ఉత్తర భారత్‌లో జనజీవనం స్తంభించిపోయేదని ''రైళ్లు స్టేషన్లలో ఆగిపోయేవి. బస్సులు స్టాపుల్లో నిలిచిపోయేవి. ప్రయాణికులు దిగి రోడ్డు పక్కనే ఉండే టీవీలకు అతుక్కుపోయేవారు. జనాలు ఎక్కువై ఎవరికీ ఏమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. కాని అక్కడ ఉండటం వాళ్లకు ప్రధానం''.


''పూర్తిగా గుడికి వెళ్లినట్లే ఉండేది. సీరియల్ మొదలయ్యే ముందు జనాలు పూజలు చేసేవారు. టీవీలకు మాలలు వేసేవారు. తిలకాలు దిద్దేవారు. సీరియల్ పట్ల వాళ్లకు అలాంటి అభిమానం ఉండేది'' అని ఆ సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ అన్నారు.''ఎక్కడికి వెళ్లినా జనాలు నన్ను, నా పాదాలను తాకేవారు. నా పట్ల ఎంతో ఆరాధనా భావం చూపేవారు. కన్నీళ్లు పెట్టుకునేవారు. ఓసారి నేను వారణాసికి వెళ్లినప్పుడు దినపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. 'శ్రీరాముడిని చూసేందుకు పది లక్షల మంది వచ్చారు' అని దానికి హెడ్‌లైన్ పెట్టారు'' అని గోవిల్ గుర్తు చేసుకున్నారు.


హిందూ జాతీయవాదం ప్రధానాంశంగా మారడంలో ఈ సీరియల్ పాత్ర ఎంతో ఉందని చాలా మంది అంటుంటారు. రామాయణం సీరియల్ మొదలయ్యేవరకూ భారత్‌లో టీవీల్లో మతపరమైన కార్యక్రమాలకు పరిమితులుండేవి. భారత్ లౌకిక దేశం కాబట్టి, అన్ని మతాలను సమానంగా చూసేది.రామాయణం టీవీ సీరియల్ ప్రసారం చేయడం ద్వారా హిందూ ఓట్లకు వల వేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, ఆ చర్య ప్రయోజనాలు మాత్రం బీజేపీకి దక్కాయి. 1998 నుంచి 2004 వరకూ కూటమి ప్రభుత్వాలు నడిపిన బీజేపీ, 2014, 2019ల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాలు అందుకుంది.


రామయాణం సీరియల్ ప్రసారమైన సమయంలో, ఆ తర్వాత... హిందూ జాగృతి అన్న ఆలోచనను సంఘ్ పరివార్ బాగా ఉపయోగించుకుంది. 'రామ రాజ్య స్థాపన' గురించి చెబుతూ వివిధ హిందూ సంస్థలనూ ఐక్యం చేసింది. ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంపై వివాదం రేగింది. దాన్ని రామ జన్మభూమిలో నిర్మించారని హిందూ జాతీయవాదులు వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: