దేశ రాజ‌కీయాలను ద‌గ్గ‌ర‌గా వీక్షించే..త్వ‌ర‌గా ప్ర‌భావితం అయ్యే రాష్ట్రంగా పేరొందిన హ‌ర్యానాలో...కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయ‌గా...  జననాయక్ జనతా పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం చేశారు. దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అజయ్ చౌతాలాకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు పెరోల్‌ కు అనుమతి ఇచ్చింది.  చండీగఢ్ లోని రాజ్ భవన్ లో మనోహర్ లాల్ ఖట్టర్, దుష్యంత్ చౌతాలాతో గవర్నర్ సత్యదేవ్ ఆర్య ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పంజాబ్ మాజీ సీఎం బాదల్, ఖట్టర్, దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులు హాజరయ్యారు.


హ‌ర్యానాలో ప్ర‌భుత్వం కొలువుదీరేముందు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా ఖట్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమర్థమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా ఖట్టర్‌ను అభినందించారు. హర్యానాలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడనున్నదని, సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందిస్తుందని తెలిపారు. అనంతరం ఖట్టర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సత్యదేవ్‌ను కలిశారు. దీంతో ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. 


మ‌రోవైపు, ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న దుష్యంత్‌ చౌతాలా తండ్రి అజయ్‌ సింగ్‌ చౌతాలాకు రెండు వారాల బెయిల్‌ మంజూరైంది. శనివారం సాయంత్రం ఆయన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. కొడుకు ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందే ఆయన బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం. తండ్రి బెయిల్‌పై విడుదల కావడం పట్ల దుష్యంత్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘మా జీవితాల్లో గొప్ప మార్పు జరుగబోతున్న సందర్భంలో మా తండ్రి నా పక్కన ఉండటం కన్నా సంతోషం ఇంకేముంటుంది’ అని పేర్కొన్నారు. బీజేపీతో చేతులు కలుపడం ద్వారా ప్రజల తీర్పును అవమానించారంటూ కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై దుష్యంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా తక్కువ సీట్లు కట్టబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంపైనే దృష్టిసారించామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: