తేజ్‌ బహదూర్‌ యాదవ్ గుర్తుండే ఉంటుంది. సైనికులకు నాణ్యమైన ఆహారం అందించడంలేదంటూ 2017లో సోషల్‌ మీడియాలో వీడియోను విడుదల చేయడం ద్వారా తేజ్‌ బహదూర్‌ వెలుగులోకి వచ్చారు. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సైన్యం నుంచి తొలిగించారు. అనంత‌రం ఆయ‌న జేజేపీలో చేరి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత‌, సీఎం ఖట్టర్‌పై పోటీచేసి ఓడిపోయారు. అయితే, తాజాగా జేజేపీ అభ్యర్థిగా బ‌రిలో దిగిన‌ తేజ్ బహదూర్ యాద‌వ్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీతో కలిసి జేజేపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర ప్రజలను దుష్యంత్‌ మోసం చేశారని విమర్శించారు. 


అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని జేజేపీ హర్యానా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నేత దుష్యంత్ చౌతాలా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో జేజేపీ అభ్యర్థి, బీఎస్‌ఎఫ్‌ బహిష్కృత జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్ ఓ వీడియో సందేశంలో అన అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. బీజేపీతో జేజేపీ పొత్తు పెట్టుకోవడంతో మనస్థాపం చెందినట్టు పేర్కొంటూ...పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. బీజేపీతో జట్టు కట్టడం ద్వారా దుష్యంత్ చౌతాల ప్రజా తీర్పును అపహాస్యం చేశారని విమర్శించారు.  బీజేపీకి జేజేపీ బీ టీమ్ లా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. 


ఇదిలాఉండ‌గా, సైన్యం నుంచి తొల‌గించ‌బ‌డిన అనంత‌రం 2019 లోక్‌సభ ఎన్నికలకు తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బీఎస్‌పీ-ఎస్పీ-ఆర్ఎల్‌డీ ఉమ్మడి అభ్యర్థిగా వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోడీపై పోటీకి దిగారు. అయితే అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. అవినీతి వల్ల కానీ, అవిధేయత వల్ల కానీ తాను ఆర్మీ నుంచి డిస్మిస్ కాలేదని తెలియజేసే సర్టిఫికెట్ సమర్పించలేదంటూ ఆయన నామినేషన్ పత్రాలను ఈసీ తోసిపుచ్చింది. అనంత‌రం జేజేపీలో చేరి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: