ఇటీవలి ఎన్నికల్లో 40 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో డీల్ కుదుర్చుకున్న సంగతి విదితమే.. జేజేపీ 10 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన 7 ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ బలం 57 కి పెరిగింది.


హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాము దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి సర్కార్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ ఎన్నికలై కాసేపటికే జెజెపి కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. 


దీంతో హర్యానా రాష్ట్రానికి  రెండవసారి ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో బాటు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా, అకాలీ దళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేత భూపేందర్‌సింగ్  హుడాతో బాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ అన్ని –10 పార్లమెంటరీ సీట్లనూ గెలుచుకుంది. ఈసారి శాసన సభ ఎన్నికల్లో 75 సీట్లు వస్తాయని ఆశించినా 40 స్థానాలతో సరిపెట్టుకుంది. దానికి తోడు ఈ పార్టీకి చెందిన పది మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓడిపోయారు. కాగా-టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ దోషిగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అజయ్ చౌతాలా (దుష్యంత్ చౌతాలా తండ్రి) ఆదివారం జైలు నుంచి రెండు వారాల పెరోల్ పై విడుదలయ్యారు. తన కుమారుడు కేవలం 11 నెలల్లోనే తన పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తెచ్చాడో తెలుస్తోందని ఆయన గర్వంగా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: