ఆర్టీసీ సమ్మెకు ముగింపు ప‌డుతుంద‌నే ఆశాభావంతో జ‌రిగిన చ‌ర్చ‌లు...అర్ధాంత‌రంగా, నిష్ప్ర‌యోజ‌నంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయా వ‌ర్గాలు వివిధ ర‌కాలుగా స్పందిస్తున్నాయి. శనివారం ప్రభుత్వ అధికారులకు ఆర్టీసీ కార్మికులకు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. హైకోర్టు చెప్పినట్టే 21అంశాలపై చర్చలు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మాత్రం కుదరని పని అని చెప్పారు. ఇందుకు కార్మిక సంఘాల నాయకులు ఓప్పుకోలేదు. మొత్తం డిమాండ్ లపై చర్చలు జరపాలని కోర‌గా...ఇందుకు అధికారులు నిరాకరించారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ...సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


సమ్మెపై ప్రభుత్వం కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మండిప‌డ్డారు. మాటలు మార్చడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని ఆరోపించారు. ఆర్టీసీ విలీనం మెనిఫెస్టోలో లేదు అని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆర్టీసీకి 2400 కోట్ల అప్పు ఉంటే 4200 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని కేసీఆర్ చెప్పారని తెలిపారు. అయితే మిగిలిన పైసలు ఎవరికి ఇచ్చారో కేసీఆర్ కే తెలువాలని అన్నారు. ఆర్టీసీని తమకు అప్పగిస్తే నాలుగేళ్లలో లాభాల్లోకి తెచ్చి చూపెడతామని అన్నారు. ఒకవేళ‌ ఆర్టీసీని లాభాల్లో తేకపోతే జీతాలు అడగమని చెప్పారు. కాగా, ఆర్టీసీ స‌మ్మెపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సైతం ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలంతా దీపావళి జరుపుకుంటుంటే.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకటి మిలిగిపోయిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం మొక్కుబడిగా చర్చలు జరిపిందని  ఆరోపించారు. కార్మిక సంఘాల నేతలను యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లడం దారుణమన్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆర్టీసీ ఎండీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


మ‌రోవైపు, ఆర్టీసీ స‌మ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.  కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలు సీఎంకు అధికారులు వివరించారు. రేపు కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: