కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది . ఏపీ నుంచి ఇప్పటి వరకూ కేబినెట్ లో  ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడం , ఈసారి విస్తరణ లో ఒకరికి అవకాశం కల్పించవచ్చుననే  ఊహాగానాలు విన్పిస్తున్నాయి . కేంద్ర మంత్రివర్గం లో స్థానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు, సుజనా చౌదరి తోపాటు , దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రముఖంగా విన్పిస్తున్నాయి . జివిఎల్ , సుజనా కంటే పురందేశ్వరి వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది .


అయితే పురందేశ్వరి కి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడానికి ప్రధాన అడ్డంకి ఆమె భర్త వెంకటేశ్వరరావు , కుమారుడు హితేష్ లు వైకాపాలో కొనసాగుతుండడమే కారణమని తెలుస్తోంది . వెంకటేశ్వరరావు , హితేష్ లు బీజేపీ లో చేరితే ఆమెను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడానికి పెద్దగా అడ్డంకులు ఏమి ఉండకపోవచ్చునని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం  . ఇక వైకాపా నాయకత్వం కూడా ,  పరుచూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టాలంటే  , పురందేశ్వరిని పార్టీలోకి తీసుకురావాలని దగ్గుబాటి పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది . అటు బీజేపీ నాయకత్వం కూడా అదే ప్రతిపాదన చేయడంతో దగ్గుబాటి కుటుంబం పొలిటికల్ జంక్షన్ లో నిలబడి ఉన్నట్లయింది . ఏ పార్టీ లో కుటుంబం మొత్తం కొనసాగాలో  తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది .


దీనితో దగ్గుబాటి ఫ్యామిలీ పూర్తిగా బీజేపీ లో కొనసాగడమే బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది . త్వరలోనే   వైకాపా కు గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని వెంకటేశ్వరరావు  భావిస్తుండగా , హితేష్ ను క్రియాశీలక రాజకీయాల్లో మరింత యాక్టివ్ చేయాలని నిర్ణయించారని అయన సన్నిహితులు చెబుతున్నారు  . పురందేశ్వరికి కేంద్ర మంత్రి కట్టబెడితే , ఆమె సామాజిక వర్గ మద్దతు లభిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: