ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. అధికారులు సీఎం కేసీఆర్ కు చర్చల నుండి జేఏసీ నాయకులే బయటకు వెళ్లారని చెప్పగా కోర్టుకు ఇదే విషయం చెప్పాలని సీఎం సూచించారు. రవాణాశాఖకు సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, రవాణా శాఖ అధికారులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. 
 
అధికారులతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మిక నేతల తీరు సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈరోజు కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. సీఎం ఆర్టీసీ కార్మికులు జేఏసీ నేతల్ని గుడ్డిగా నమ్ముతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం అధికారులకు తాత్కాలిక ఉద్యోగులు ఎవరైనా బస్సుల్లో టికెట్లు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో చర్చలు విఫలం కావటానికి మీరంటే మీరు కారణమని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ ఇంఛార్జీ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. ఆర్టీసీ అధికారులు ఈ లేఖ గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
ఆర్టీసీ జేఏసీ ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరింది. కోర్టులో వాదించాల్సిన అంశాలపై కేసీఆర్ న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: