గోటితో పోయేదాన్ని గొడ్డలితో తెచ్చుకోకంటారు పెద్దలు. అనాలోచితంగా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతటి ప్రమాదాన్ని సృష్టిస్తాయో చాలా సార్లు వినే ఉంటాం. చూసే ఉంటాం. ఒక్కోసారి నవ్వులాటకు అనుకున్న మాటలు ప్రమాదకరంగా మారి ప్రాణాలు తీసుకునే వరకు వస్తాయి. అంతటితో ఆగకుండా ఆ పోరు కారుచిచ్చులా రగిలి గొడవ పడిన కుటుంబాలచుట్టు వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలానే జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..


రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ చివరకు రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన ఎక్కడంటే కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ పంచాయతీలోని దళితవాడలో జరిగింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గొడవల నేపథ్యంలో ఇరుగు పొరుగున ఉంటున్న రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు దీనికి రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో ఇరుపార్టీల మధ్య పెద్ద గొడవ జరిగి కొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ఏడుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలు కాగా, వైసీపీ కార్యకర్తలు ముగ్గురు గాయపడ్డారు.


వీరిలో జ్ఞాన ముత్తయ్యపై కొడవలితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తిరుపతి రిమ్స్  కు తరలించారు. ఇకపోతే స్థానికులు అందించిన సమాచారంతో చక్రాయపేట ఎస్సై జె.రవికుమార్  నేతృత్వంలో పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి  తెచ్చారు. గాయపడిన వారిని కడప రిమ్స్  కు తరలించారు.


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై రవికుమార్  తెలిపారు. ఈ పరిస్దితి నేపధ్యంలో మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఇకపోతే వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ వెనక కారణాలు తెలియాల్సి ఉంది. ఇవి ఉద్దేశ్యపూర్వకంగా చేసారా లేక అనుకోకుండా ఘర్షణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: