ఐసిస్ చీఫ్ అబూబకర్ బాగ్దాదీ కథ ముగిసింది. 90 నిమిషాల ఆపరేషన్ లో అమెరికా సైన్యం ధాటికి తట్టుకోలేక... కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆపరేషన్ బాగ్దాదీకి టర్కీతో పాటు ఓ ఉగ్రవాది భార్య ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. 


టర్కీ సరిహద్దుకు మూడు మైళ్ల దూరంలో బాగ్దాదీ ఉన్నట్టు వారం రోజుల క్రితమే పసిగట్టిన అమెరికా దళాలు... రహస్య ఆపరేషన్ కు ప్లాన్ చేశాయి. దీనికి టర్కీ సహకారం కూడా తీసుకున్నారు. 8 అపాచీ హెలికాప్టర్లు ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంతో.. ఐసిస్ ప్రతిఘటించలేకపోయింది. దీంతో వేరే దారిలేక కుటుంబంతో సహా ఆత్మాహుతికి పాల్పడ్డాడు బాగ్దాదీ. గతంలో ఐసిస్ కు మద్దతుగా ఉన్న టర్కీని మంచి చేసుకున్న అమెరికా.. ఆ దేశం ఇచ్చిన సమాచారంతో బాగ్దాదీని చుట్టుముట్టింది. 2015లో అరెస్టైన ఐసిస్ ఉగ్రవాది భార్య కూడా బాగ్దాదీ చావుకు కారణమని తెలుస్తోంది. అమెరికా దళాలకు చిక్కిన ఆమె.. ఐసిస్ కు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చింది. దీంతో బాగ్దాదీ ఆటకు చెక్ చెప్పింది అమెరికా సైన్యం. 


ఐసిస్ కు చెందిన ఓ ఉగ్రవాదిని టార్గెట్ చేయడానికి వచ్చినట్టుగా ఆపరేషన్ మొదలుపెట్టిన అమెరికా... గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తిచేసింది. తాము వేసిన ప్రణాళిక అనుకున్న విధంగా అమలు చేశామని వైట్ హౌస్ కు సమాచారమిచ్చింది అమెరికా సైన్యం. అల్ ఖైదా కమాండర్ గా జీవితం మొదలుపెట్టిన బాగ్దాదీ.. ఐసిస్ ను స్థాపించి అమెరికా కంటికి కునుకు లేకుండా చేశాడు. మరే ఉగ్రవాద సంస్థా విస్తరించినంత వేగంగా ఐసిస్ విస్తరించింది. సిరియా, ఇరాక్ లో మెజారిటీ భూభాగాన్ని ఒడిసిపట్టి... చాలా దారుణాలు చేసింది. ఎట్టకేలకు బాగ్దాదీ ఆత్మాహుతితో... ఐసిస్ మరింత బలహీనపడుతుందని భావిస్తోంది అమెరికా. 


మరింత సమాచారం తెలుసుకోండి: