ఎన్నో తుఫాన్లు, వరదలు తట్టుకుని నిలబడిన ఆ తీరం గత కొన్నాళ్లుగా విధ్వంసానికి గురవుతోంది. అడ్డదిడ్డంగా నదీగర్భాన్ని కబ్జాచేసేసిన కొందరు అక్రమార్కులు బ్యూటీ స్పాట్ గా పేరుపొందిన ఆ బీచ్ ను కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. దాంతో సాగరతీరంలో అలజడి మొదలైంది.  ఇలాంటి సమయంలో సిక్కోలు అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంశధారనదిలో జోరుగా సాగుతున్న ఆక్వా చెరువులను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్ అంపలాం సక్సెస్ అయ్యింది.


చారిత్రక సంపదకు పుట్టినిల్లైన శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం సాగరతీరానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.  పర్యాటకులను విశేషంగా ఆకర్షించే అందమైన ఇసుకతిన్నెలకు నిలయం. అలాంటి కళింగపట్నం గత కొన్నేళ్లుగా కోతకు గురవుతోంది. సాగరతీరంలో కలిసే నదీజలాలు బీచ్‌ను నామరూపాల్లేకుండా ఊచకోతకోసేస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలకు దూసుకొస్తున్న నదీజలాలు తోడవ్వడంతో... కళింగపట్నం సిక్కోలు చిత్రపటంలో కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.


అపారమైన జలవనరులుండి కూడా వ్యవసాయానికి నీరు సరిగా వాడుకునే పరిస్థితి లేని శ్రీకాకుళం జిల్లాలో... ఏటా వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఒడిషా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటరై 90 కిలోమీటర్ల మేర ప్రయాణించే వంశధార నది కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా వంశధార నదిలోని నీరు సముద్రంలో కలిసే సమయంలో  పెద్ద ఎత్తున తీరం కోతకు గురవుతోంది. ఇందుకు ప్రధాన కారణం పోలాకి మండలంలోని అంపలాం వద్ద ఆక్వా రూపంలో నదీగర్భంలో ఆక్రమణలు పెరిగిపోవడమే. 


నదీగర్భంలో సుమారు 25 ఎకరాల్లో అక్రమంగా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. ఇలా ఇక్కడి రొయ్యల చెరువులకు ఇబ్బంది లేకుండా పత్యేకంగా గ్రోయిన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా సముద్రంలో కలవాల్సిన నీరు దిశమార్చుకుంది . రాజారాంపురం సమీపంలో సాగరంలో కలవాల్సిన నీరు కళింగపట్నం వైపు దూసుకొస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రకృతి విధ్వంసంపై మత్స్యకారులు, పర్యాటక ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన వరదల తాకిడికి వంశధార నదీజలాలు కళింగపట్నం బీచ్ పై విరుచుకుపడ్డాయి.  దీంతో కనీవినీ ఎరుగునంత విధ్వంసం జరిగింది. తీరం వందల మీటర్ల మేర సముద్రంలో కలిసిపోయింది. దీనిపై స్థానికులు, మత్స్యకారులు గళమెత్తడంతో ఈ ఇష్యూ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 


కళింగపట్నం బీచ్ కోతపై స్పందించి, నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. కోతకు గల కారణాలను నిపుణుల బృందం స్పష్టంగా తెలియజేయడంతో సిక్కోలు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. "ఆపరేషన్ అంపలాం " పేరిట అంపలాం వద్ద వంశధారనదీ గర్భంలో ఉన్న రొయ్యల చెరువులను ధ్వంసం చేసేశారు. దాంతో వంశధార నదీమతల్లికి చెర వీడినట్టయింది. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి... నదులు, కాలువలు, చెరువులు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో కబ్జాకు తెగబడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా అధికారులు చేపట్టిన  ఈ ఆపరేషన్ అంపలాం ఓ హెచ్చరిక లాంటిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: