కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి... ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వంశీ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాయగా, చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. వంశీకి ఆయన రిప్లే ఇవ్వ‌గా వంశీ సైతం త‌న లేఖ‌పై బాబు స్పందించినందుకు రిప్లే ఇచ్చారు.
ఈ క్ర‌మంలోనే వంశీ బాబు అడుగు జాడ‌ల్లోనే న‌డిచినందుకు తాను హింస‌ను ఎదుర్కొన్నాన‌న్నారు.


ఎన్నిక‌ల త‌ర్వాత త‌న‌కు ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని... రాజకీయంగా వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇక గ‌త ఐదు నెల‌లుగా తన నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కుంటు ప‌డింద‌ని కూడా చెప్పారు. తన వారిని ఇబ్బందుల పాలు చేయడం ఇష్టం లేకనే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాని చెప్ప‌డంతో పాటు సొంత పార్టీ నేత‌ల‌పై సైతం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


త‌న పోరాటానికి జిల్లాలో పార్టీ మద్దతు తనకు లభించకపోయినా, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడానని అన్నారు. ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌ద్ద‌ని కూడా త‌న‌పై ఒత్తిళ్లు వ‌చ్చిన సంగ‌తి మీకు తెలుస‌ని కూడా చంద్ర‌బాబుకు స్ప‌ష్టం చేశారు. క‌న‌ప‌డ‌ని శ‌త్రువుతో యుద్ధం చేయ‌డం క‌ష్ట‌మ‌ని కూడా వంశీ తెలిపారు. ఇక జిల్లాలో పార్టీ మ‌ద్ద‌తు లేద‌న్న అంశం చెప్ప‌డం ద్వారా ప‌రోక్షంగా దేవినేని ఉమతో త‌న‌కు ఉన్న రాజ‌కీయ వైరాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.


ఉమాతో ముందు నుంచి వంశీకి రాజ‌కీయ ప‌రమైన వైరం ఉంది. ఉమాకు 2009లో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే టిక్కెట్ ద‌క్క‌పోవడంలోనూ... గ‌త ఐదేళ్ల‌లో గ‌న్న‌వ‌రంలో వంశీని ఇబ్బంది పెట్ట‌డంలోనూ ఉమా తెర వెన‌క చ‌క్రం తిప్పార‌న్న చ‌ర్చ‌లు ఉన్నాయి. వంశీ సైతం ఎన్నోసార్లు తాను అధికార పార్టీలో ఉండి కూడా జిల్లా పార్టీ నేత‌ల తీరుతో ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం ప్ర‌స్తావించారు. అలాగే ఉమా వంశీని రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేశాడో.... అన్ని ప్ర‌య‌త్నాలు చేశాడ‌న్న చ‌ర్చ‌లు కూడా ఉన్నాయి.


గ‌త ఐదేళ్లు మంత్రిగా ఉన్న ఉమ గ‌న్న‌వ‌రం అభివృద్ధి విష‌యంలో శీత‌క‌న్ను వేయ‌డంతో పాటు వంశీ అధికారుల వ‌ద్ద పెట్టిన ప్ర‌తిపాద‌న‌లను తొక్కిప‌ట్టేవార‌ని టీడీపీ నేత‌లు కూడా గుస‌గుస‌లాడుకున్నాయి. ఇక ఇప్పుడు వంశీ మ‌రోసారి అదే విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌ట్ల‌య్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: