ఈరోజు తెల్లవారుజామున విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి కన్నుమూశారు. కొద్దిరోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న రాఘవాచారి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 30 సంవత్సరాలపాటు విశాలాంధ్ర ఎడిటర్ గా రాఘవాచారి కొనసాగారు. 1972 సంవత్సరంలో విశాలాంధ్ర ఎడిటర్ గా రాఘవాచారి బాధ్యతలు తీసుకున్నారు. 
 
రాఘవాచారి సెప్టెంబర్ 10, 1939 సంవత్సరంలో జన్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలంలోని శాతాపురం గ్రామం రాఘవాచారి స్వస్థలం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి మృతి పట్ల సంతాపం తెలిపారు. జర్నలిజం వృత్తిలో విలువల కోసం రాఘవాచారి కృషి చేశారని సీఎం జగన్ అన్నారు. రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని జగన్ అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాఘవాచారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మాజీ సంపాదకులుగా రాఘవాచారి అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. రాఘవాచారి జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. రాఘవాచారి సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు అన్నారు. 
 
రాఘవాచారి గారు ఒక మంచి వక్త అని నిరాడంబరుడని కమ్యూనిస్టు పార్టీకి అంకితమయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని రాఘవాచారి సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాఘవాచారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా, నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ గా రాఘవాచారి సాగించిన జీవితం ఆదర్శప్రాయం అని అన్నారు. కేసీఆర్ రాఘవాచారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాఘవాచారి భౌతికకాయాన్ని మఖ్దుమ్ భవన్ కు తరలించారు. సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంకట్ రెడ్డి రాఘవాచారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. విశాలాంధ్ర గౌరవ ఛైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు రాఘవాచారి మృతి పట్ల సంతాపం తెలిపారు. 



 
 



మరింత సమాచారం తెలుసుకోండి: