తెలంగాణ ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంటుంద‌ని భావిస్తున్న సంద‌ర్భం...నేడు సోమ‌వారం. ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అటు ప్ర‌భుత్వం త‌మ ప‌ట్టును వీడ‌ని త‌రుణంలో...స‌మ్మె 23 రోజులు పూర్తి చేసుకుంది. కోర్టు సూచనతో జరిగిన చర్చల్లో కూడా ప్రతిష్ఠంభన నెలకొంది. అసలు చర్చలు జరగకుండానే.. అజెండా విషయంలోనే భేదాభిప్రాయాలు వచ్చి కార్మికులు బయటికొచ్చేశారు. దీనిపై ఇటు ప్ర‌భుత్వ ప్ర‌తినిధులుగా వ‌చ్చిన అధికారులు....అటు కార్మిక సంఘాల నేత‌లు...ప్ర‌త్య‌ర్థి ప‌క్షాన్ని త‌ప్పుప‌ట్టాయి. ఈ స‌మ‌యంలో....నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 


ఆర్టీసీ కార్మికులు గత 23 రోజులుగా చేస్తున్న సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మె విషయంతో పాటు కార్మికులకు సెప్టెంబర్ జీతాలపై కూడా హైకోర్టు క్లారిటీ ఇవ్వనుంది. కోర్టు సూచించాకే చర్చలు జరిగాయి కాబట్టి... అవి ఎలా జరగాలో కూడా కోర్టే చెబుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆదేశించే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు కార్మికుల వాదనకు ఓటేస్తుందా.. యాజమాన్యం అభిప్రాయానికి విలువిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి.


మ‌రోవైపు, ఆర్టీసీ స‌మ్మెపై ప్ర‌భుత్వం బ‌లంగానే త‌న వాద‌న‌లు వినిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కోర్టులో విచార‌ణ నేప‌థ్యంలో...ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాల తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి.. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పారు. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ అధికారులు కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. చర్చలను కార్మిక సంఘాలు బహిష్కరించి వెళ్లాయని కోర్టుకు ప్రభుత్వం త‌ర‌ఫున అధికారులు తెలపనున్న‌ట్లు స‌మాచారం. త‌ద్వారా ఆర్టీసీ కార్మికుల విష‌యంలో సంఘాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని హైకోర్టుకు స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: