కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారంపై టీడీపీ నేతలతో చర్చించారు. వంశీని బుజ్జగించే బాధ్యతను ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణకు చంద్రబాబు అప్పగించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 
 
చంద్రబాబు నాయుడు వంశీని భయపడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని వంశీ ఇచ్చిన లేఖకు బదులిచ్చారు. వంశీ చంద్రబాబు రాసిన లేఖకు స్పందిస్తూ 13 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పని చేశానని 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశానని కానీ ప్రస్తుతం గన్నవరంలో టీడీపీ పార్టీ నేతలను వైసీపీ పార్టీ వేధిస్తోందని వంశీ లేఖలో పేర్కొన్నారు. 
 
వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విజయవాడ ఎంపీ కేశినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు వంశీని బుజ్జగించే బాధ్యతను చంద్రబాబు అప్పగించారు. లేఖలో వంశీ పొందుపరిచిన అంశాల గురించి కూడా చర్చించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు వంశీ రాజకీయాలకు దూరం కావటం లేదని వ్యూహాత్మకంగా కొన్నిరోజుల తరువాత వైసీపీ పార్టీలో చేరబోతున్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజీనామా చేసిన వెంటనే పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ నుండి వ్యతిరేకత వస్తుందని భావించిన వంశీ వైసీపీ పార్టీలో ఖచ్చితంగా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ తో వంశీ చర్చలు జరిపారు. చర్చల అనంతరం జగన్ నుండి హామీ లభించటం వలన వంశీ రాజీనామా చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: