తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జాతర మళ్లీ రానున్నది. దీపావళి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల జాతర మారు మోగనున్నది. మున్సిపల్ ఎన్నికల పట్టణాలకే పరిమితం కానున్నప్పటికీ ఎన్నికలతో ప్రజలు సతమతమౌతున్నారు. 2018 సెప్టెంబర్ నెల నుంచి తెలంగాణలో ఎన్నికలకు బ్రేక్ పడడం లేదు. మున్సిపల్ ఎన్నికలపై గత ఆరు నెలల నుంచి హైకోర్టులో తేలకపోవడంతో ఈ ఎన్నికలు కొంత ఆలస్యం జరిగింది. మూడు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో మారు రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనున్నది. రెండు రోజుల క్రితమే హూజూర్ నగర్ ఉప ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ కూడా శనివారం నిర్వహించింది. ఉప ఎన్నికల నుంచి పార్టీలు ఇంకా కోలుకోనే లేదు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావడమంటే కొంత ఇబ్బంది తలెత్తే అంశమే. కానీ ప్రజ క్షేత్రంలో తేల్చుకోక తప్పదు. అధికార టీఆర్ ఎస్ పార్టీ హూజూర్ నగర్ గెలుపుతో ఊపు మీద ఉన్నదని తెలుస్తుంది. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టి 2గంటలు పలు అంశాలను వివరించారు. ఆర్టీసీ సమ్మెపై కూడా ఆయన కార్మికులను హెచ్చరించినట్లే మాట్లాడారు. దీన్నిబట్టి ప్రజలు ఆర్టీసీ సమ్మెను పట్టించుకోవడం లేదని, అందుకే హూజూర్ నగర్ లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని పరోక్షంగా వెల్లడించారు. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీకి పట్టే పగ్గాలేవన్నట్లు వ్యవహరిస్తుంది. ఈ ఊపును తట్టుకొని ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతిపక్షాలకు కొంత కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హూజూర్ నగర్ లో ఓటమి పాలైందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయడం అంతా సులువైన పని కాదని తెలుస్తుంది.


మరో రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలపై రాష్గ్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ నాగిరెడ్డి కూడా కసరత్తు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీన్నిబట్టి అధికార యంత్రాంగం కూడా ఎన్నికలకు సన్నద్ధమౌతున్నట్లు అర్థమౌతుంది. దీంతో ప్రతిపక్షాలు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్లకతప్పదు.
రాష్ట్రంలో గత ఏడాది కాలం నుంచి అధికార పార్టీ టీఆర్ ఎస్ కు ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీదే పై చెయ్యి. ఎంపీ ఎన్నికల్లో కొంత తడబడినప్పటికీ, దాని తర్వాత జరిగిన జెడ్పీటీసీ , ఎంపీటీీసీ ఎన్నికల్లో టీిఆర్ఎస్ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.


ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు ఎన్నికలను ఎదుర్కొవడం కొంత కష్టమేనని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా పార్టీకి ఏ ఎన్నికల్లోనూ పెద్దగా కలిసిరాలేదు. గ్రామ సర్పంచులు, జేడ్పీటీసీ, ఎంపీటీసీల్లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ సీట్లతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ హూజూర్ నగర్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆరుసార్లు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిన సీటును కోల్పోవడంతో ఉత్తమ్ డీలా పడ్డారని తెలిసింది. ఓటమిపై ఉత్తమ్ ఎక్కడా కూడా పత్రిక ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని తెలుస్తుంది. ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కొకతప్పదు.


కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ కొంత కాలం నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ పై దూకుడు వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే హూజూర్ నగర్ ఎన్నికల్లో బీజేపీ హేమాహేమీలు బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. గెలుపు మాటమోగానీ డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో బీజేపీ దూకూడుకు హూజూర్ నగర్ ఎన్నికలు కళ్లేం వేసింది. అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు గాంభీర్యం ప్రదర్శించారు. తమ ఓటమి కొత్తేమి కాదని, ఎన్నోసార్లు ఓడిపోయి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చామని వెల్లడించారు.


రాష్ట్రంలో టీడీపీ పార్టీ చాలా బలహీనమైన విషయం తెలిసిందే. ఈ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన సీట్లు రాలేదు. పైగా ఆ పార్టీ నుంచి గెలిచిన ఎ మ్మెల్యేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్పంచు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఖమ్మం జిల్లాలో కొంత మేరకు సీట్లు సాధించినప్పటికీ మిగతా జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయినప్పటికీ టీడీపీ పార్టీ కూడా హూజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టింది. కానీ ఆశించిన మేరకు ఓట్లు రాలేదు. పైగా డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాల్లేవు.


ఇదిలా ఉండగా రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి కూడా అంతగా అనుకూలంగా లేవని తెలుస్తుంది. గ్రామీణ ఓటర్లతో పోల్చితే పట్టణ ఓటర్ల తీర్పు వేరుగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన ఏడాది దాటినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ నోటిఫికేషన్లు వేయలేదు. పైగా టీఆర్టీ పరీక్షల ఫలితాలు వచ్చి ఆరు నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకూ పోస్టింగులు ఇవ్వలేదు. పైగా ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు 61సంవత్సరాలకు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకూ వీటిని అమలు చేసేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాకుండా ప్రస్తుతం 21 రోజుల నుంచి నడుస్తున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పడే అవకాశాలున్నాయి. పైగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటారు కొంత ఆలోచించి ఓటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయలేదు. చాలా మంది బస్తీల్లోని పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా నూతన పింఛన్లను కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధి, విధానాలను కూడా అంతా ఈజీ కాదని తెలుస్తుంది. అధికార పార్టీ హామీలను నేరవేర్చడంలో డీలా పడడంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఊరట కల్గించే అంశాలు. అయితే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లోనే ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. దీంతో మున్సిపల్ లో తమ సత్తా చాటాలని ఆ పార్టీ చూస్తుంది. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ లో ఓటర్లు ఏ పార్టీని వరిస్తారో వేచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: