ఇరిగేషన్ శాఖపై ఈరోజు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సమీక్ష ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు అందించిన నివేదికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వారు అందించిన నివేదికల ప్రకారం సీఎం వారికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచీ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

 

కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్ల నీటిమట్టం.. ప్రస్తుత పరిస్థితిని సీఎం వైఎస్ జగన్‍కు అధికారులు వివరించారు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులపై అధికారులు సీఎంకు వివరాలు నివేదించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా ప్రతిపాదిత ప్రాజెక్ట్ ల పైనా సుదీర్ఘంగా సీఎం చర్చించారు. కాల్వల సామర్ధ్యం, పెండింగ్ పనులపై సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం కోరారు. వరద నీరు వచ్చే 40 రోజుల్లో తగు జాగ్రత్తలు తీసుకుని అన్ని ప్రాజెక్టులు నిండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి అంచనాలపై నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిధులు వినియోగించంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని జగన్ సూచించారు. 

 

 

నీటిపారుదల శాఖ చేపట్టిన ప్రతి పనికి ఫలితాలు వచ్చేలా ఉండాలని ఆయన అధికారులతో అన్నారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా జలయజ్ఞం పనులు పెండింగ్‍లో ఉండిపోతున్నాయన్న అధికారుల అభ్యంతరాలను సీఎం సానుకూలంగా స్పందించారు. చేపట్టే ఏ పనైనా మొదటి ప్రాధాన్యత దిశగా చూసుకుని ముందుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: