ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తాజాగా హైకోర్టులో విచారణ జ‌రిగింది. గత 23 రోజులుగా నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌పై ఇటు ఆర్టీసీ యాజ‌మాన్యం త‌ర‌ఫున వారి లాయ‌ర్‌...అటు కార్మిక సంఘాల ప్ర‌తినిధుల త‌ర‌ఫున వారి న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్టీసీ తరఫున‌ వాదనలు వినిపించగా...ఆర్టీసీ యూనియన్ తరపున‌ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.

ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో వాదనలు మొదలైన సంద‌ర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్టీసీ తరపు వాదనలు వినిపిస్తూ..కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై  చర్చ జరగాలని పట్టుబట్టాయ‌ని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చ చేద్దామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాట వినలేదని ఆరోపించారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని తెలిపారు. చర్చల వివరాలతో అదనపు కౌంటర్ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసింది. చర్చల సమయంలో అన్ని డిమాండ్లు చర్చించాలని కార్మిక సంఘాలు పట్టు పట్టాయని తెలిపింది.


న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి ఆర్టీసీ యూనియన్ తరపున వాద‌న‌లు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని తెలిపారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు ఇతర డిమాండ్లపై చర్చించలేదని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చింది మొత్తం డిమాండ్ల మీద మాత్రమే అని ఆర్టీసీ సంఘాలు పేర్కొంటూ కేవలం 21 డిమాండ్లు మాత్ర‌మే ఉన్నట్టు అధికారులు ప్రచారం చేశార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 

హైకోర్టు ఈ సంద‌ర్భంగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ...మొదట 21 డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని పేర్కొంది. ఒక్క డిమాండ్‌పై పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్ట్ న్యాయ‌మూర్తులు ప్ర‌శ్నించారు.  విలీనం డిమాండ్ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించాలని హైకోర్టు సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో కార్పొరేషన్ పై ఆర్ధిక భారం కానీ డిమాండ్ల పై చర్చ జరగాలన్నామ‌ని హైకోర్ట్ తెలిపింది. ఆర్థిక భారం లేని డిమాండ్ల‌పై చర్చలు జరగాలని తాము బావించామని, మొదట 21 డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది. రాత్రికి రాత్రే (ఓవర్ నైట్లో) ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యం అవుతుందని హైకోర్ట్ ప్ర‌శ్నించింది. విలీనం డిమాండ్ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చ జరగకపోతే ఇలానే ప్రతిష్టంభన కొనసాగుతుందని హైకోర్ట్ అభిప్రాయ‌ప‌డింది. ఇరు వర్గాల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరోసారి గుర్తు చేస్తున్నామని హైకోర్టు ఈ సంద‌ర్భంగా పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: