వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగడం కంటే దగ్గుబాటి కుటుంబం బీజేపీ లో కొనసాగడానికే మొగ్గు చూపుతోందా? అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అయన తనయుడు హితేష్ ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడాన్ని పరిశీలిస్తే అవుననే సమాధానం విన్పిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం  దగ్గుబాటి పురందేశ్వరి  కాంగ్రెస్ ను వీడి, బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . పురందేశ్వరికి బీజేపీ నాయకత్వం కూడా సముచిత స్థానమే కల్పించింది  . గతం లో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి, జాతీయ మహిళా మోర్చా అధ్యకపదవి కట్టబెట్టింది .


ఇక రెండుమార్లు ఈమెకు లోక్ సభ టికెట్ ను కేటాయించింది. అయితే రెండుసార్లు  ఎన్నికల్లో పురందేశ్వరి పరాజయం పాలయింది .  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  లో చేరారు . పరుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అయన  స్వల్ప ఓట్ల తేడా తో ఓటమి పాలయ్యారు . ఎన్నికల అనంతరం దగ్గుబాటి ని పరుచూరు పార్టీ ఇంచార్జ్ గా ప్రకటించకుండా నాయకత్వం తాత్సారం చేస్తూ రావడమే కాకుండా , తనకు రాజకీయంగా బద్ద విరోధులను తిరిగి పార్టీలో చేర్చుకోవడం పట్ల వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారు .


ఇదే విషయాన్ని అయన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా , పురందేశ్వరిని కూడా పార్టీ లోకి తీసుకురావాలని షరతు విధించారన్న  ప్రచారం జరుగుతోంది . అయితే పురందేశ్వరి,  బీజేపీ లోనే కొనసాగేందుకు మొగ్గు చూపడంతో , దగ్గుబాటి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ నాయకత్వానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: