తెలుగుదేశం పార్టీకి , శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ , రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను ఒకవైపు బుజ్జగిస్తూనే , మరొకవైపు ఉప ఎన్నిక అనివార్యమైతే ఎదుర్కొనేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది . వంశీ మోహన్ ను బుజ్జగించే బాధ్యతలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , విజయవాడ ఎంపీ కేశినేని నాని , సీనియర్ నాయకుడు కొనకళ్ల నారాయణకు అప్పగించారు . పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి  రాజీనామాను చేస్తానంటున్న వంశీని ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా వీరిరువురు  నేతలు బుజ్జగించనున్నారు .


 అయితే వంశీ పార్టీ నాయకత్వం మాట వినకపోతే , ఉప ఎన్నిక తప్పదని భావిస్తోన్న టీడీపీ నేతలు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు . గన్నవరం నియోజకవర్గం టీడీపీ కి బాగా పట్టున్న నియోజకవర్గం కావడం తో , ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు . గన్నవరం అభ్యర్థిగా గతం లో జెడ్పి చైర్మన్ గా , విజయవాడ లోక్ సభ సభ్యుడి గా , ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గా కొనసాగుతోన్న గద్దె రామ్మోహన్ రావు సతీమణి గద్దె అనురాధ ను బరిలోకి దించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి .


గతం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలవర్దన్ రావును కాదని  వంశీ కి టికెట్ ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం ఆయన కూడా  టీడీపీని వీడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా లో చేరిన విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు . దాంతో ఒకవేళ ఉప ఎన్నికలంటూ జరిగితే అనురాధ ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: