పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస హత్యలతో ప్రజలను హడలెత్తించిన సీరియల్ కిల్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16వ తేదీన పీఈటీ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ప్రసాదంలో విషం కలిపి హత్యలు చేస్తున్నట్లు గుర్తించారు. 
 
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో నిందితుడు హత్యలు చేశాడు. సీరియల్ కిల్లర్ ఎక్కువగా తన బంధువులనే టార్గెట్ చేసి చంపాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో నిందితుడు సీరియల్ కిల్లర్ గా మారినట్లు తెలుస్తోంది. మొదట ఈ వ్యక్తి బంధువులు, తెలిసినవారికి పూజలు చేస్తే కోటీశ్వరులు అవుతారని నమ్మించాడు. వారికి ఒక నాణేన్ని ఇచ్చి ఆ నాణెం ఉంచుకుంటే కలిసొస్తుందని చెప్పేవాడు. 
 
నిందితుడు చెప్పినట్లు జరగకపోవటంతో బాధితులు అతడిని ప్రశ్నిస్తే బాధితులకు విషం ఇచ్చి వారి దగ్గర ఉన్న నగదు, బంగారం దోచుకొనివెళ్లేవాడు. ఏలూరులో 16వ తేదీన చనిపోయిన ఒక పీఈటీ మాస్టర్ తన వెంట తీసుకెళ్లిన నగదు, బంగారం మాయమవటంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో విషప్రయోగం జరిగిందని తెలియటంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 
 
పీఈటీ కాల్ డేటా ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకొని విచారణ చేయగా నిందితుడు 8మందిని ప్రసాదం ఇచ్చి హత్య చేసినట్లు చెప్పటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు బాధితుడు చెప్పిన ప్రాంతాల నుండి మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తరువాత నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆస్తి కోసం ఇంత దారుణంగా హత్యలు చేస్తారా? అని ఈ సీరియల్ కిల్లర్ గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: