తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్-ఆర్టీసీ) సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రోడ్డు రవాణాసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ సొమ్మును ఎందుకు చెల్లించలేదని హైకోర్టు నిలదీసింది.


*జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన ₹1475 కోట్లు,

*ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన ₹1492 కోట్లు

*ప్రభుత్వం నుంచి బకాయిపడ్డ ₹2300 కోట్లు


తదితర చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రేపు మంగళవారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా, ఎల్లుండి వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరగా,  అందుకు హైకోర్టు నిర్ద్వంధంగా తిరస్కరించింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.

 

అంతకు ముందు వాదనలు కొనసాగుతున్న సమయంలో, కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి ₹175 కోట్ల నష్టం వచ్చిందని,  రాజకీయ పార్టీలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ,   చర్చల వివరాలను తెలుపుతూ అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఇడి ల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ తాత్కాలిక ఎండీకి నివేదిక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు.

 

వీటిలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేవని ఈడీ నివేదికలో పేర్కొందని రామచంద్రరావు తెలిపారు. మరి ఈడీ కమిటీ నివేదిక తమకెందు కు సమర్పించ లేదని కోర్టు ప్రశ్నించింది. నివేదికలు కోర్టుకు కూడా తెలపరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల  డిమాండ్లు సాధ్యం కాదని ముందే నిర్ణయం తీసుకున్నారా? అని ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యానించింది.

 

కార్మికుల వేతనాలు పెంచామని కోర్టుకు ఆర్టీసీ పేర్కొంటూ, సమ్మె చట్టవిరుద్ధమని ఏఏజీ తన వాదనలో పేర్కొనగా, కోర్టు స్పందిస్తూ  "చట్ట విరుద్ధమని చెపుతున్నారు, మరి వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా?" అని ప్రశ్నించింది. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం ₹50 కోట్లు ఇవ్వగలదా? అని కోర్టు ప్రశ్నించగా, ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి ₹ 450 కోట్లు ఇచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో కల్పించుకున్న కోర్టు, "మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి ప్రభుత్వ కార్యదర్శిని, ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలుస్తాం" అని వ్యాఖ్యానించింది. అయితే కార్మికులను మాత్రం రాత్రికి రాత్రే ఆర్టీసీ విలీనం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. 

 

అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ తరపున వాదనలు వినిపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ను హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కార్మికుల తీరు సరిగా లేదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు.

 

తదుపరి విచారణను మంగళ వారానికి వాయిదా వేసింది. ఆర్టీసీకి నిధుల బకాయిలపై రేపటిలోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున వాదనలు వినిపించిన ప్రకాశ్‌ రెడ్డి, కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశం మీద చర్చలు జరపాల్సిందేనని హైకోర్టుకు నివేదించారు. కార్మికుల 26 డిమాండ్లపై కచ్చితంగా చర్చ జరగాలన్నారు. కార్మికులు లేవనెత్తిన అంశాలు మొత్తం న్యాయపరమైనవేనని, వీటివల్ల ఆర్ధికభారం పడుతుందని ప్రభుత్వం వాయిదావేస్తూ వస్తుందని పేర్కొన్నారు.


ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే నేడు సమ్మె పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాక పోవటం, ఆతరవాత ఆర్టీసీ ఋణాలపై వడ్దీలు చేల్లించటం తో సంస్థ నడ్డి విరిగి నష్టాల్లో కూరుకు పోయిందని వివరించారు. ఆర్టీసీకి   ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఎండీని ప్రభుత్వం నియమించ లేదని, దీనిపై గతంలో హైకోర్ట్ ఆదేశాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎండీ ఉండుంటే కార్మికులు తమ సమస్యలను ఆయనకు నివేదించుకునే వారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌-మీట్‌లో మాట్లాడిన అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎంఎన్‌యూ) జాతీయ అధ్యక్షుడు మౌలాలా ఆరోపించారు. ఆర్టీసీకి ప్రభుత్వం పడిన బకాయిలపై రేపటి లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు. సమ్మె చట్టబద్ధమేనని హైకోర్టు చెప్పిందని, కార్మికులు అధైర్యపడ వద్దని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: