ఏపీ రాజకీయాల్లో గత రెండు రోజులుగా టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వంశీ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు లేఖ రాశారు. వాస్తవంగా చూస్తే వంశి వైసీపీలోకి వెళుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వంశీ సహజంగానే టిడిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన వైసీపీలో కి వెళతారని అందరూ అనుకున్నారు. అయితే అదే టైంలో తనకు గత నాలుగైదు నెలలుగా రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని వైసిపి నేతల నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయని బాంబు పేల్చారు.


అటు సీఎం జగన్ ను కలవడం తో పాటు వైసీపీని సైతం టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో వంశీ మైండ్ లో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక వంశీ తాను పడుతున్న ఇబ్బందులు గురించి టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాయటం... అటు చంద్రబాబు వంశీకి అండగా ఉంటాం అని చెప్పటం... మళ్ళీ వంశీ బాబుకు రెండోసారి లేఖ రాయటం ఈ తంతు అంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య ఫిక్సింగ్ వ్యవహారం నడుస్తోందా ? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


ఇక వంశీ రాజీనామా లేఖ కూడా బాబుకు వాట్సాప్ లో టైప్ చేసి పంపడం ఒక ఎత్తు అయితే... ఆ తర్వాత చంద్రబాబు కూడా వాట్సాప్ లోనే రిప్లై ఇవ్వటం మరో ఎత్తు అనుకోవాలి. వైసీపీ నాయకులు, అధికారుల వేధింపుల నుంచి అనుచరులను కాపాడుకునేందుకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వంశీ లేఖ రాయగా… చంద్రబాబు అందుకు స్పందించారు. అన్యాయం జరిగితే తలదించుకోకుండా పోరాటం చేయాలని వంశీకి సూచించారు. ఇక చంద్రబాబు స్పందనకు స్పందించిన వంశీ తనకు అండగా ఉంటానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలిసో తెలియకో తన పరిధి దాటి ప్రవర్తిస్తే మన్నించాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


ఇక తన ఆవేదన అర్థం చేసుకున్నందుకు బాబుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక తన అనుచరుల వేధింపుల నుంచి కాపాడుకునేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వంశీ ఇప్పుడు అప్రజాస్వామిక విధానాల‌పై తాను గతంలో ఎన్నోసార్లు పోరాటం చేశాం అంటూ చెప్పటం చర్చనీయాంశం అయింది. వంశీ నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఉంటే తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో పంపి ఆమోదించుకుని ఉంటే అప్పుడే ఆయన రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని నమ్మొచ్చు. కానీ ప్రస్తుతం వంశీ - చంద్రబాబు మధ్య జరుగుతున్న తంతు చూస్తుంటే వీరిది గోల్‌మాల్ వ్య‌వ‌హారంగానే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: