ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్‌ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌విత్వంతో కూడిన ఘాటు కామెంట్లు చేశారు. క‌శ్మీర్‌కు, యూరోప్ దేశానికి లింక్ పెట్టి సెటైర్లు, విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లే అక్క‌డ ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు. ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు. దీంతో జ‌మ్మూక‌శ్మీర్‌కు ఇవాళ యురోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన ఎంపీలు సంద‌ర్శిస్తున్నారు. ఈయూ బృందం రాక‌పై ఓవైసీ ఎద్దేవా చేశారు.


ఇవాళ ఉద‌యం శ్రీన‌గ‌ర్ చేరుకున్న ఈయూ ఎంపీల బృందం.. క‌శ్మీర్ అందాల‌ను తిల‌కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌దుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఇస్లాం అంటే భ‌య‌ప‌డే (ఇస్లామోఫోబియా)  ఈయూ నేత‌లు క‌శ్మీర్ లోయ‌కు ఎందుకు వ‌చ్చార‌ని  ఓవైసీ ప్ర‌శ్నించారు. నాజీ ప్రేమికులు.. క‌శ్మీర్ లోయ‌లో ఉండే ముస్లిం ప్రాంతాల‌కు వెళ్తున్నార‌ని ఉర్దూ భాష‌లో ఓ ట్వీట్ చేశారు. గైరోంపే క‌ర‌మ్ అప్నోంపే సిత‌మ్ అన్న భావాన్ని కూడా ఆయ‌న వినిపించారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరును అస‌దుద్దీన్ ఓవైసీ త‌న‌ ట్వీట్‌లో ప్ర‌శ్నించారు. 


ఇదిలాఉండ‌గా, క‌శ్మీర్ లోయ‌కు ఈయూ నేత‌ల‌ను తీసుకురావ‌డం ప‌ట్ల ఇత‌ర పార్టీ నేత‌లు కూడా త‌ప్పుప‌డుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ఎంపీల రాకను ప్ర‌శ్నించారు. బ‌య‌టి దేశాల ఎంపీలు క‌శ్మీర్‌కు వ‌స్తుంటే, స్థానిక ఎంపీల‌ను మాత్రం వెళ్ల‌నివ్వ‌డం లేద‌ని ప్రియాంకా ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్‌కు వెళ్లేందుకు మనదేశ రాజకీయ నాయకులను అనుమతించని మోదీ సర్కారు ఈయూ ఎంపీలను మాత్రం ఎందుకు అనుమతించిందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇది పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ధ్వజమెత్తింది. ఛాతీ చరుచుకునే జాతీయవాద ఛాంపియన్ (ప్రధానిని ఉద్దేశించి) ఈయూ నేతలను కశ్మీర్‌లో అనుమతించడానికి గల కారణమేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: