ఆంధ్ర ప్రదేశ్ ను ప్రస్తుతం ఇసుక తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఇసుకతో రాష్ట్ర ప్రభుత్వన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. అధికార, ప్రతిపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నా.. ప్రధానంగా ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు నష్టపోతున్నారు. ఈ అంశం తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనిపై ప్రతి రోజూ పోరాటాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇసుక కొరతపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.

 


రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. లోకేశ్ చేపట్టనున్న దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నాయకులు తరలిరానున్నారు. రాష్ట్రంలో ఐదు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గుంటూరులో జిల్లాలోనే ముగ్గురు కార్మికులు ఆత్మహత్య చేసుకుని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఇసుక వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి రోజూ ఈ సమస్యపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.. ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర మంత్రులను పలు చోట్ల భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్న సంఘటనలు కూడా గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నాయి. దీంతో కార్మికుల తరపున ప్రభుత్వంపై పోరాడేందుకు లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

 


మరో పక్క.. వరద ప్రభావం వల్ల ఇసుక సరఫరా కొరత ఉందని.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం అంటోంది. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ఇసుక కొరతపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్ దీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: