కేసీయార్ రాజకీయ చాణక్యం ముందు జగన్ తట్టుకోలేరని అంతా భావించారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో ఇద్దరి దోస్తే పాతకాలం నాటి అన్నదమ్ముల కధ సినిమాను తలపించింది. అప్పట్లో జగన్ పూర్తిగా కొత్త కావడంతో కేసీయార్ పిలిచిందే తడవుగా మీటింగులు పెట్టేవారు, భేటీలు వేసేవారు. దాని మీద టీడీపీ చేసిన కామెంట్స్ కూడా అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇక ఏపీలోని మేధావులు అయితే జగన్ కేసీయార్ వలలో పడవద్దు అని గట్టి హెచ్చరికలనే పంపించారు.


ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కేసీయార్ తో జగన్ కటీఫ్ అంటున్నారని సమాచారం. దాన్ని ఇంకోలా చెప్పుకోవాలంటే కేసీయార్ కూడా జగన్ అంటే మునుపటిలా  ఇష్టపడడంలేదని చెబుతున్నారు. దానికి అచ్చమైన ఉదాహరణగా ఈ మధ్యన మీడియాతో మాట్లాడిన కేసీయార్ ఆర్టీసీ విలీనం గురించి ఏకంగా జగన్ని డైరెక్ట్ గానే విమర్శించేశారు. ఏపీలో ఆర్టీసీ విలీనం అన్నది అసలు జరగలేదని విమర్శించడం జగన్ తో ఉన్న బ్రేకప్ ని సూచిందనే అంటున్నారు. ఏపీలో ఏం జరిగింది విలీనం, అక్కడ ఏ మన్నూ కూడా జరగలేదు, ఎస్ ఐ యామ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్ అంటూ కేసీయార్ నిండు మీడియా సమక్షంలోనే జగన్ని ఆక్షేపించారు.



ఆ తరువాత చూసుకుంటే జగన్ దానికి కౌంటర్ అన్నట్లుగా ఆర్టీసీ మీద ఒక వర్కింగ్ గ్రూప్ నే ఏర్పాటు చేస్తూ నివేదికను ఇరవై రోజుల్లో ఇవ్వాలని కోరడం ద్వారా ఆర్టీసీ  విలీనం తన చిత్త శుద్ధి ఏంటో చెప్పకనే చెప్పేశారు. అదే విధంగా  జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల కల్పన వంటివి కూడా కేసీయార్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాయట. దాంతో ఆయన లోలోపల మధనపడుతున్నారని అంటున్నారు. మరో వైపు బీజేపీలో జగన్ కి కొంతవరకూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కేసీయార్ ని పూర్తిగా పొలిటికల్ సీన్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. అంతవరకూ జగన్ని బీజేపీ ఏమీ చేయదని అంటున్నారు.


అయితే జగన్ తాను చెప్పినట్లుగానే వింటాడు, తాను ఉమ్మడి ఏపీకి పెద్దన్న అని కేసీయార్ ప్రోజక్షన్ ఇవ్వడం, బీజేపీ నేతల వద్ద అలా ఫోకస్ అవడానికి చూడడం జగన్ కి నచ్చలేదని అంటున్నారు. వీటితో పాటు అనేక ఇతర కారణాల వల్ల కూడా జగన్, కేసీయార్ ల దోస్తి మూడు నాళ్ళ ముచ్చట అయ్యిందని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ వివాహానికి జగన్ కేసీయార్ ఒకరి తరువాత ఒకరు రావడం, అసలు పలకరించకుండా పోవడం బట్టి చూస్తూంటే ఇప్పటికిపుడు ఇద్దరూ మళ్ళీ  భేటీలు వేసే అవకాశాలు లేవని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: