మ‌రోమారు హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసింది.పెద్ద ఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళఖాతంతో పాటు అరేబియా సముద్రంలోను ఒకేసారి అల్పపీడనాలు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతం అంతటా మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో భారీ వ‌ర్షం కురిసింది.


హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, ఎల్బీనగర్‌, నాగోల్‌, కాప్రా, మన్సూరాబాద్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మల్కాజ్‌గిరి, నాగారం, నేరేడ్‌ మెట్‌, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతోపాటుగా, హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. కాగా,  తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాభావం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనాలకు.. ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి అధిక వర్షపాతం ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్‌ సహా పలు జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా, ఇప్పటికే భారీగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ‌డంతో...అక్క‌డ అధికారులు మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టారు.తాజాగా కురిసిన భారీ వ‌ర్షం ఆ ప్ర‌య‌త్నాల‌కు గండికొట్టిన‌ట్ల‌యింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మ‌రోమారు అధికారులు హెచ్చరించారు. ప్ర‌యాణికులు సైతం వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: