తెలంగాణ ఆర్టీసీ స‌మ్మె ఏపీకి సెగ పెట్టింది. ఆర్టీసీని ఏపీలో ప్ర‌భుత్వంలో విలీనం చేసింది జ‌గ‌న్ స‌ర్కారు. తెలంగాణ‌లో కూడా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని డిమాండ్‌తో స‌మ్మె షురూ అయింది. అయితే స‌మ్మెపై స‌ర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం డిమాండ్లు సాధించే వర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని ప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మాన్ని సాగిస్తున్నారు. ఇప్ప‌టికి ఆర్టీసీ స‌మ్మె 23 రోజులు పూర్తి అయింది. ఈ స‌మ్మెపై అటు ప్ర‌భుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.


ఈ కేసును ప‌లు ద‌ఫాలుగా విచారించిన హైకోర్టు ఇరుప‌క్షాల‌కు ప‌ట్టువిడుపులతో చ‌ర్చ‌లు జ‌రుపాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. హైకోర్టు సూచ‌న‌ల మేర‌కు కార్మిక సంఘాలు చ‌ర్చ‌ల‌కు సిద్దమ‌య్యాయి. కానీ ప్ర‌భుత్వం త‌రుపునుంచి ఏక‌ప‌క్ష వైఖ‌రి అవ‌లంభించ‌డంతో చ‌ర్చ‌లు ప్ర‌తిష్టంభన నెల‌కొంది. అయితే చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయ‌ని, ఇవి కార్మిక సంఘాల వైఖ‌రితోనే విఫ‌లం అయిన‌ట్లు హైకోర్టులో చూపే ప్ర‌య‌త్నం చేసింది తెలంగాణ స‌ర్కారు.


మంగ‌ళ‌వారం హైకోర్టులో ఇరు ప‌క్షాలు వాద‌న‌లు వినిపించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌రుపున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ ఆర్టీసీ చెల్లించాల్సిన బ‌కాయిల‌పై కౌంట‌ర్ దాఖాలు చేశారు. అయితే ఈ కౌంట‌ర్‌లోనే తెలంగాణ స‌ర్కారు ఏపీ స‌ర్కారుకు దెబ్బేసింది. ఆర్టీసీకి తెలంగాణ రాష్ట్రం ఎలాంటి బ‌కాయిలు లేవ‌ని కోర్టుకు విన్న‌విస్తూనే, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆర్టీసీ అప్పుల పంప‌కాలు జ‌రుగ‌లేద‌ని కోర్టుకు వివ‌రించింది. దీంతో ఆస్తులు, అప్పులు ఎందుకు జ‌రుగ‌లేని కోర్టు ప్ర‌శ్నించింది.


దీనికి స్పందించిన అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ విభ‌జ‌న చ‌ట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఆర్టీసికి సంబంధించి అంశాలు ఉన్నాయ‌ని కోర్టుకు తెలిపారు. ప్ర‌భుత్వం కోర్టుకు ఆర్టీసీ ఆస్తులు పంప‌కాలు, అప్పుల పంప‌కాలు జ‌ర‌గ‌లేద‌ని చెప్పి ఏపీని ఇందులో ఇన్వాల్వ్ చేసింది తెలంగాణ స‌ర్కారు. తెలంగాణ స‌ర్కారు కావాల‌ని చేసిందా.. లేక అనుకోకుండా చేసిందో కానీ విభ‌జ‌న స‌మ‌స్య‌లోని ఓ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోర్టు చూపే అవ‌కాశం క‌లిగింద‌నే అనుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: