ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇసుక తుపాను రేగుతోంది. కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని అస్త్రంగా మలచుకున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇసుక కొరత కారణంగా ఒకరిద్దరు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడం కూడా విపక్షాల విమర్శలకు మరింత ఆస్కారం ఇచ్చింది. దీంతో ఇసుక సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జగన్ విపక్షాలు చేస్తున్న ఇసుక రాజకీయానికి బాగా ఫీలనట్టు తెలుస్తోంది.


సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. పళ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు వేస్తున్నారని ఇసుక వ్యవహారంపై సీఎం వ్యాఖ్యానించారు... వ్యవస్థలన్నింటినీ గత ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. వాటిని పూర్తిగా రిపేర్‌ చేస్తున్నాం. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.


ఇంకా జగన్ ఏమన్నారంటే.. ‘ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. కానీ రాబంధుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల 90 రోజుల్లో ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం.


వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం కూడా పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలి. మనం ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: