ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. కానీ ఏ రెండు పార్టీలు కలిసే అవకాశాలు అక్కడ కనిపించడంలేదు. దీనికి ప్రజలు ఇచ్చిన అరకొర తీర్పు కారణం అన్న భావన ఉంది. మరో వైపు కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన వారికి మెజారిటీ అయితే దక్కింది కానీ పేచీలు మాత్రం పెరిగిపోతున్నాయి. దాంతో రాజీకి కనీస ఆలోచన కూడా రెండు వైపుల నుంచి జరగడంలేదు. ఫలితాలు వచ్చి రేపటికి వారం అవుతున్నా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడడంలేదు.


దీంతో ఏం జరుగుతోంది. ఏం చేయాలనుకుంటున్నారు అన్న‌ది ఎటూ పాలుపోవడంలేదు. నిజానికి మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి పూర్తి మెజారిటీ వచ్చింది. రెండు పార్టీలకు కలిపి 161 సీట్లు వచ్చాయి. అందులో సింహ భాగం అంటే 105 సీట్లు ఒక్క బీజేపీకే వచ్చాయి. ఇంకా బీజేపీకి టచ్ లో ఉన్న వారు మరో 15 మంది ఇండిపెండెంట్లు అంటున్నారు. శివసేన కేవలం 56 సీట్లతో ఉంది. డబుల్  సీట్లు సాధించిన బీజేపీపై పెత్తనం చేయాలనుకుంటోంది.


దీంతోనే మోడీ, అమిత్ షాలకు మండుకొస్తోందట.  తాము పెద్ద పార్టీగా  ఉన్నామని, ప్రభుత్వం ఏర్పాటుకు తమకే అవకాశం, అధికారం ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది. కానీ శివసేన శివతాండవమే ఆడుతోంది. మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీలో కూర్చోవాల్సిందేనని పట్టుపడుతోంది. తొలి రెండున్నరేళ్లు తమకు అధికారం ఇవ్వలని డిమాండ్ చేస్తోంది. బాలధాకరే మనవడు ఆదిత్య థాకరేను సీఎం చేయమని వత్తిడి తెస్తోంది. గట్టిగా  ముప్పయ్యేళ్ళు కూడా లేని ఆదిత్య ధాకరే  ఎమ్మెల్యేగా  గెలిచింది ఒక్కసారే. అందువల్ల ఆయన్ని సీఎం ఎలా చేస్తామని బీజేపీ అంటోంది. పైగా తమది పెద్ద పార్టీ అని వాదిస్తోంది. అవసరం అయితే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కూడా చెప్పినా శివసేన వినడంలేదు. తాను పట్టిన పట్టు విడవడంలేదు.


ఈ పరిణామాల నేపధ్యంలో ఇపుడు మహా సంక్షోభం తలెత్తుతోంది. అందువల్ల రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్రా సాగుతుందా అన్నది చూడాలి. లేకపోతే సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో సర్కార్ ఏర్పాటు చేయించి ఆ మూడు నాళ్ల ముచ్చట చూసేశాక అసలు కధ నడపాలా అన్నది కూడా కమలనాధులు ఆలోచిస్తున్నారుట.  ఇంకో వైపు శివసేన నుంచి ఎమ్మెల్యేలను లాగేయాలని కూడా భారీ స్కెచ్ గీస్తోందట.  మొత్తానికి చూసుకుంటే సేన బుట్టలో పడకూడన్న బీజేపీ పంతం ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: