నేడు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం. ఎన్నికల హామీలతో పాటు, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లోని కొన్ని అంశాలపై సీఎం చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఇసుక సమస్య, కార్మికుల ఆత్మహత్యలు, ప్రతిపక్షాల దాడులపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇసుక వారోత్సవాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



కేబినెట్ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. రూ.197 కోట్లతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. ప్రస్తుతమున్న 40 అగ్రిల్యాబ్స్‌తో కలిపి కొత్త ల్యాబ్స్ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. జెరుసలేం యాత్రకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం రూ.60 వేలకు పెంచేందుకు ప్రతిపాదన చేయనున్నట్టు తెలుస్తోంది. హజ్ యాత్రకు రూ.30 వేలు పెంపుదలకు సంబంధించి ప్రతిపాదన కూడా తీసుకురాన్నారు. మన్యంలోని 77 మండలాల్లో మహిళలకు పౌష్టికాహారాన్ని రెట్టింపు చేసే అంశంపై చర్చ జరిపే అవకాశం ఉంది. అడ్వకేట్ల సంక్షేమ నిధి పెంపు అంశంపై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. బిల్డ్ ఏపీ మిషన్ ఏర్పాటుపై రాష్ట్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులు ఇచ్చే అంశంపై రాష్ట్ర మంత్రి మండలి చర్చించబోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ప్రతిపాదన తీసుకురానుంది. విజయవాడ కేంద్రంగా సీపీడీసీఎల్ సంస్థ ఏర్పాటుపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.



నవంబర్ 7న పదివేల లోపు డిపాజిట్లు కలిగిన అగ్రిగోల్డ్ బాధితులకు 264 కోట్ల పంపిణీ, నవంబర్ 14న మనబడి నాడు-నేడు పథకానికి శ్రీకారం, నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకారులకు 10వేల రూపాయల డీజిల్ సబ్సీడీ వంటి కీలక పథకాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు పలు పరిశ్రమల స్థాపనకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: